5 జులై, 2012

చపాతి గొంతులో ఇరుక్కొని టెక్కీ రెండేళ్ల కూతురు మృతి
హైదరాబాద్: గొంతులో చపాతి ఇరుక్కొని రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బుధవారం చోటు చేసుకుంది. ఆర్‌కె పురంలోని లక్ష్మీ బేబీ కేర్ సెంటర్‌లో అన్విత అనే చిన్నారి చపాతి తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ పాపను బేబీ కేర్ సెంటర్ నిర్వాహకులు వెంటనే దగ్గర్లోని కామినేని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

వైద్యులు ఆ పాప మృతి చెందినట్లు తెలిపారు. చపాతి గొంతులో ఇరుక్కోవడం వల్లే అన్విత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బేబీ కేర్ సెంటర్ పైన, నిర్వాహకుల పైన తల్లిదండ్రులు కేసు పెట్టనున్నారని తెలుస్తోంది.

ఎల్‌బి నగర్‌లోని టెలిఫోన్ కాలనీలో లవకుశ, రజిత దంపతులు ఉంటున్నారు. రజిత ఓ ప్రయివేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. లవకుశ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు తమ తమ విధులకు వెళ్తారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తారు.

ఇంట్లో ఎవరూ ఉండక పోవడంతో తమ రెండేళ్ల చిన్నారి అన్వితను లక్ష్మీ బేబీ కేర్ సెంటర్‌లో వదిలేసి వెళతారు. రోజులాగే ఈ రోజు కూడా తల్లిదండ్రులు పాపను కేర్ సెంటర్‌లో వదిలారు. వారు చిన్నారులకు చపాతి పెట్టారు. అది గొంతులో చిక్కుకొని అన్విత మృతి చెందింది.