25 జులై, 2012

కూతురు సితార కోసం మహేష్ బాబు బ్రేక్...


మహేష్ బాబు, నమ్రత దంపతులు మూడు రోజుల క్రితమే పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు ‘సితార' అనే పేరు కూడా పెట్టేశారు. పాపాయి పుట్టిన ఆనందంలో ఉన్న మహేష్ బాబు సినిమాలకు కొంత కాలం బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నాడు. మరో రెండు వారాల పాటు ఆయన ఏ షూటింగులోనూ పాల్గొనకుండా ఇంటిపట్టునే ఉంటూ సితారతో గడపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి డాక్టర్లు నమ్రతకు జులై 26న డెలివరీ డేట్ ఇచ్చారట. అయితే అంతకంటే ఆరు రోజుల ముందుగానే...అందులోనూ శ్రావణ శుక్రవారం సితార జన్మించడంతో మహేష్ దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఇల్లు బంధువుల హడావుడితో సందడిగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఇతర తారాగణంపై సీన్ల చిత్రీకరణ చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తుండగా మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.