3 జులై, 2012

గాంధీ ఆత్మకథను చదువుతున్న జగన్
వివిధ కేసుల్లో హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న విఐపి ఖైదీలు యోగా, ధ్యానం, పుస్తక పఠనం వంటి కార్యక్రమాల ద్వారా ఓదార్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ షటిల్ ఆడుతున్నారు. దానికితోడు ఆయన మహాత్మాగాంధీ ఆత్మకథను చదువుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఇంటర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంటుల్లో తన సత్తా చాటారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సంగీతం వింటూ, భారతీయ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన యోగా, ధ్యానాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, గాలి జనార్దన్ రెడ్డి బంధువు, ఒఎంసి డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ట్రైమెక్స్ గ్రూపు చైర్మన్ కోనేరు ప్రసాద్, ఎమ్మార్ ఎంజిఎఫ్ దక్షిణ భారత ఆర్థిక విభాగం అధిపతి విజయరాఘవ, వైయస్ జగన్ ముఖ్య అనుచరుడు సునీల్ రెడ్డి, ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్ ఉన్నారు.

ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మహిళా జైలులో ఉన్నారు. వీరంతా తమ తమ రంగాల్లో నిష్ణాతులే. పేరు ప్రఖ్యాతులు సంపాదించినవారే. నిమ్మగడ్డ ప్రసాద్ జైలులో చెస్ ఆడుతూ గానీ ధ్యానం చేస్తూ గానీ ఎక్కువ సమయం గడపుతున్నారట. యోగా పట్ల ఆయన ఆసక్తి ప్రదర్సిస్తున్నారని చెబుతున్నారు. అప్పుడప్పుడు భారతీయ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నట్లు చెబుతున్నారు.

జగన్ భారత ప్రథమ ప్రధాని డిస్కవరీ ఆఫ్ ఇండియాపై, మహాత్మ గాంధీ ఆత్మకథపై దృష్టి సారించినట్లు సమాచారం. రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దూరదర్శన్ కూడా చూస్తున్నారని అంటున్నారు. దానికితోడు సునీల్ రెడ్డితో కలిసి షటిల్, క్యారమ్స్ ఆడుతున్నారట. శ్రీలక్ష్మి మాత్రం ఒంటరిగా గడపడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇతరులతో ఆమె ఎక్కువగా మాట్లాడడం లేదని చెబుతున్నారు.

1 వ్యాఖ్య:

శ్యామలీయం చెప్పారు...

గాంధీ నెహ్రూల జీవితాలలోని లొసుగులెన్నటనికే వారిని గురించి జగన్ అధ్యయనం చేయటం లేదని విశ్వసించుదాం.