10 జులై, 2012

పోస్టర్ల కలకలం: నిన్ననిత్యానందస్వామి నేడు యాదగిరి




















గుంటూరు: జిల్లాలో పోస్టర్లు చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో గుంటూరులో సెక్స్ రాకెట్ కేసులో ఇరుక్కున్న నిత్యానంద స్వామి పైన, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసులో అరెస్టైన యాదగిరి రావు పైన వరుసగా పోస్టర్లు వెలుస్తున్నాయి. ఇవి జిల్లాలో చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా యాదగిరి రావు పైన మరోసారి ఫ్లెక్సీ వెలిసింది. రౌడీ దర్బార్ పేరుతో ఈ ఫ్లెక్సీ వెలిసింది.

అందులో యాదగిరి పైన వెటకారంగా ఓ కవిత కూడా రాసి పెట్టారు. అంతకుముందు కూడా యాదగిరి అరెస్టు కాగానే ఓ ఫ్లెక్సీ వెలిసింది. ఇలాంటి రౌడీలే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా మారుతున్నారని ఆ ఫ్లెక్సీలో రాశారు. అంతకుముందు నిత్యానంద స్వామి పైన కూడా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పదిహేను రోజుల క్రితం అవినీతికి, నిత్యానందకు లింక్ పెట్టి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

అది అటు వైపు వెళ్లే వారి అందరి దృష్టిని అది ఆకర్షించింది. ది మూన్ సేన పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. అందులో నిత్యానందకు వెటకారపు వ్యాఖ్యల ద్వారా స్వాగతం పలికారు. ఆయనకు వెటకారంగా స్వాగతం పలుకుతూనే రాష్ట్రంలోని అవినీతిపై కూడా ఎద్దేవా చేశారు. ఆ ప్లెక్సీలో.. తమిళనాడు, కర్నాటకలలో ఛీత్కారాలతో సతమతమవుతున్న నిత్యానంద స్వామికి సాదర స్వాగతం.. నేటి మా ఎపి అక్రమార్కులకు, అవినీతిపరులకు అండగా ఇక్కడి క్రింది స్థాయి న్యాయవ్యవస్థ వరకు జీతాలు తీసుకుంటున్న వారు అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.

ఈ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. రాష్ట్రంలోని అవినీతి, నిత్యానంద స్వామి లీలలకు పెద్దగా తేడా లేదని అంతకన్నా అవినీతే అతి దారుణమన్నట్టుగా ఫ్లెక్సీలో పేర్కొనడం ఆకర్షిస్తోంది. అవినీతిని విమర్శిస్తూనే నిత్యానందకు వెటకారంగా స్వాగతం పలకడం విశేషం. కాగా నిన్న నిత్యానంద, నేడు యాదగిరి పోస్టర్లు వెలిశాయని రేపు ఎవరి పోస్టర్లు వెలుస్తాయో చూడాలని చర్చించుకుంటున్నారు.