14 జులై, 2012

నాని: ఎన్టీఆర్ ఆఫీస్‌పై దాడి, వారసత్వ పోరేనా?

కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జైకొట్టిన ప్రభావం హీరో జూనియర్ ఎన్టీఆర్ పైన తీవ్రంగా పడుతోందనే చెప్పవచ్చు. బుధవారం రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత జూనియర్ కార్యాలయం పైన దాడి రాజకీయవర్గాలలో చర్చనీయాంశమైంది. ఈ దాడి ఎవరైనా ఆకతాయిలు చేశారా, పార్టీలో తెలిసి తెలియని అభిమానులు చేశారా లేక వారసత్వ పోరులో భాగంగా చోటు చేసుకుందా అనే చర్చ జరుగుతోంది.

కొడాలి నాని వ్యవహారంపై జూనియర్ ఘాటుగా స్పందించక పోవడం తెలుగుదేశం పార్టీ అభిమానుల మనసులను తీవ్రంగా గాయపర్చి ఉంటుందని అందుకే ఈ ఘటన జరిగి ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఇండికా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో జూనియర్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కార్యాలయ అద్దాలు పగిలాయి. ప్రస్తుతం జూనియర్ శ్రీను వైట్ల దర్సకత్వంలో రూపొందుతున్న బాద్‌షా చిత్రీకరణ కోసం ఇటలీలో ఉన్నారు.

జూనియర్ కార్యాలయంపై ఘటన కారణంగా ఆయన ఇంటికి బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశముంది. సిసి కెమెరాల ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే అవకాశముంది. ఈ దాడి కొడాలి నాని కౌంటర్ అటాక్ తర్వాత జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఇటీవల నాని జగన్ వైపు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే నాని వెనుక తాను లేదని చెప్పేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జూనియర్ మాత్రం పార్టీ మార్పుపై పెద్దగా స్పందించలేదు.

నాని పార్టీ మారడాన్ని ఆయన తప్పు పట్టలేదు. సరికాదా ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చునని చెప్పారు. 2004లో, 2009లో తాను పట్టుబట్టి టిడిపి టిక్కెట్ ఇప్పించారు జూనియర్. తనకు అత్యంత సన్నిహితుడు. ఇలాంటి వ్యక్తి పార్టీ నుండి వెళుతుంటే నామమాత్రంగానైనా ఆయనపై విమర్శలు చేయలేదు. నాని వ్యవహారం వెనుక జూనియర్ హస్తం లేదని టిడిపి నేతలు బయటకు చెబుతున్నా లోలోన మాత్రం ఖచ్చితంగా ఆయన హస్తం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారట.

పార్టీకి తాను అండగా ఉంటానని ఓ వైపు చెబుతూనే తనకు సన్నిహితుడైనా ఎమ్మెల్యే పార్టీ వీడుతుంటే జూనియర్ ఎందుకు నచ్చ చెప్పలేక పోయారని, నానికి బాబుతో విభేదాలు ఉంటే రాజీ ఎందుకు కుదిర్చే ప్రయత్నం చేయలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బయటకు జూనియర్, టిడిపి ఒక్కటిగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల వారసత్వ పోరు జరుగుతున్నట్లుగా మాత్రం క్షుణ్ణంగా కనిపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ వీడిప్పుడు సరిగా స్పందించక పోవడమే కాకుండా... నాని బుధవారం పార్టీ అధినేత చంద్రబాబుపై చేసిన పరుషపదాలు టిడిపి అభిమానులను బాధించాయని అంటున్నారు. అంతేకాదు బాబును తిట్టిన నాని జూనియర్‌ను మాత్రం పొగిడారు. ఇది నందమూరి అభిమానులను కలిచి వేసిందని, జూనియర్ కార్యాలయంపై దాడి నాని వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ అని అంటున్నారు.