3 జులై, 2012

రామ్ చరణ్ ‘జంజీర్’ తాజా అప్డేట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘జంజీర్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ద్వారా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్‌పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జంజీర్' చిత్రానికి రీమేక్.

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన‘జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజా రీమేక్‌లో ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.

రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.