3 జులై, 2012

జామపళ్లు, చాక్లెట్లు ఆశ చూపి లైంగిక వేధింపులుఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతను భాగోతం బయటపడి పోలీసులు రావడంతో పరారయ్యాడు. జిల్లాలోని చీరాలలో ఓ ప్రాథమిక పాఠశాల పక్కన వెంకట్రావు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఈ పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉంది. తరగతుల అనంతరం విరామ సమయాలలో చిన్నారులు బయటకు వచ్చేవారు.

అలాంటి సమయంలో వెంకట్రావు చాక్లెట్లు, జామపళ్లు ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకు వెళ్లి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఇతను గత నాలుగైదేళ్లుగా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొద్ది కాలం క్రితం వెంకట్రావు భార్య ఇతని వికృత చేష్టలను భరించలేక అతనిని వదిలేసి వెళ్లిపోయిందని అంటున్నారు.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విద్యార్థులను పిలిపించుకొని లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. రెండు మూడు రోజుల క్రితం కూడా ఎప్పటి మాదిరి వెంకట్రావు జామపళ్లు, చాక్లెట్ల పేరుతో ఇద్దరు విద్యార్థులను తన ఇంటికి తీసుకు వెళ్లాడు. కాసేపటికి వారిద్దరు ఏడుస్తూ బయటకు వచ్చారు. స్థానికులు, పాఠశాల యాజమాన్యం ఏం జరిగిందో తెలుసుకుంది. వెంకట్రావు కామాంధుడని తెలుసుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చేసరికి వెంకట్రావు పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. నాలుగైదేళ్లుగా వెంకట్రావు ఇలా చేస్తున్నప్పటికీ బయటకు రాకపోవడానికి కారణం పాఠశాల బాధ్యతారాహిత్యమే అని స్థానికులు మండిపడుతున్నారు. వెంకట్రావును శిక్షించి, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పాఠశాల అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.