4 జులై, 2012

చరణ్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్, ట్విట్టర్ డిలీట్ఇది నిజంగా రామ్ చరణ్ అభిమానులకు షాకింగ్ న్యూసే. ఇకపై చరణ్‌తో తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం అభిమానులకు ఉండదేమో. అసలు ఇకపై చెర్రీతో సోషల్ నెట్వర్కే ఉండదేమో. అందుకు కారణం చరణ్ ట్విట్టర్ అకౌంట్ twitter.com/Alwayscharan డిలీట్ కావడమే. రామ్ చరణ్ ఏం ట్వీట్ చేశాడు అనే విషయాలు తెలుసుకోవడానికి వెళ్లిన వారికి Sorry, that page doesn't exist! అని కనిపిస్తోంది. అకౌంట్ డిలీట్ చేసినప్పుడే ఇలా అవుతుంది.

‘అయితే ఎవరైనా హ్యాకర్లు దాడి చేయడం వల్ల తాత్కాలికంగా చరణ్ అకౌంట్ బ్లాక్ చేశారా? లేక కావాలనే చరణ్ అభిమానులతో సంబంధాలు తెంచుకున్నాడా? అనేది తేలాల్సి ఉంది. రోజూ లక్షల మంది అభిమానులు చరణ్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతుంటారు. తాజా వ్యవహారంతో అంతా అప్ సెట్ అయ్యారు.
 
రామ్ చరణ్ తరచూ తన సినిమాలు, వ్యక్తి గత వివరాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా చరణ్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ కావడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఏం జరిగిందో ఏమో అని ఆందోళనకు గురవుతున్నారు. సాయంత్రం‌ లేదా రేపటిలోగా ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘జంజీర్' షూటింగులో భాగంగా బ్యాంకాక్ లో ఉన్నాడు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జంజీర్' చిత్రానికి రీమేక్.