18 జులై, 2012

తలొగ్గిన చంద్రబాబు: రాష్ట్రపతి ఎన్నికలకు దూరం
హైదరాబాద్: తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నార చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యతిరేకిగా ప్రణబ్ ముఖర్జీని భావిస్తూ, మతతత్వ బిజెపి మద్దతిస్తున్న పిఎ సంగ్మాను బలపరచలేక రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయనున్నట్లు చంద్రబాబు ఇంతకు ముందు సంకేతాలు ఇచ్చారు. అయితే, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీని బలపరచకూడదంటూ తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ వ్యతిరేకిగా పరిగణిస్తూ ఆయనకు ఓటు వేయకకూడదని వారు సూచించారు. వారి విజ్ఞప్తికి చంద్రబాబు తలొగ్గినట్లు చెబుతున్నారు.

ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్నామని రమేష్ రాథోడ్ చెప్పారు. అలాగే, మతతత్వ బిజెపి సమర్థిస్తున్న పిఎ సంగ్మాకు కూడా ఓటు వేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటేర్లవరూ పాల్గొనబోరని రమేష్ రాథోడ్ చెప్పారు.

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆ పార్టీ తన వైఖరిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వకూడదని తెలంగాణ జెఎసి తెలంగాణ పార్టీలను, ప్రజా ప్రతినిధులను కోరింది.