12 జులై, 2012

టార్గెట్ చంద్రబాబు: కొడాలి నాని వ్యూహం ఏమిటి?
హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గుడివాడ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణను గానీ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను గానీ ఆయన ఏమీ అనలేదు. పైగా, చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముందుకు సాగదని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు రావాలంటే ఆయన సమాధానం చెప్పలేదు. పార్టీ అధ్యక్షుడి మార్పు పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు జరగాలని గతంలో హరికృష్ణ అన్నారు. దీన్నిబట్టి ఆయన చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ఆయనను ఇరకాటంలో పెట్టాలని భావించినట్లు అర్థం చేసుకోవచ్చు.

పార్టీని వీడిపోయే ముందు చంద్రబాబును సాధ్యమైనంత మేరకు ఇరకాటంలో పెట్టాలనేది నాని వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే, ఆయన చంద్రబాబును లక్ష్యం చేసుకుని ఏకధాటిగా విమర్శలు కురిపించారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పడం ద్వారా చంద్రబాబును సవాల్ చేశారని చెప్పవచ్చు. చంద్రబాబు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా తనను సస్పెండ్ చేయడాన్ని నాని ఆయుధంగా వాడుకున్నారు.

ఎన్టీఆర్ అభిమానులను చంద్రబాబు వ్యూహాత్మకంగా బయటకు పంపిస్తున్నారని అనడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ అసంతృప్తి గల కారణమేమిటో నర్మగర్భంగా చెప్పారని, తద్వారా కార్యకర్తల నుంచి న్యాయబద్ధతను పొందాలని ఆయన భావించినట్లు చెప్పవచ్చు. కాంగ్రెసు నాయకులతో చంద్రబాబుకు కూడా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని, తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత పరిచయం ఉండడంవల్లనే పలకరించడానికి వెళ్లానని ఆయన చెప్పారు. చంద్రబాబు నిర్ణయంలోని హేతబద్ధతను ఆయన ప్రశ్నించారు.

తనపై ఘాటుగా విమర్శలు చేసిన కృష్ణా జిల్లా నాయకులను ఒక్క మాటతో తీసేశారు. ఒక్క రకంగా చంద్రబాబును నాని ఆత్మరక్షణలో పడేశారనే చెప్పాలి. పార్టీ మారదలుచుకుంటే ఆయన మామూలుగా తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోతే సరిపోయేది. కానీ నాని ఉద్దేశం కేవలం పార్టీ మారడమే కాదు, సాధ్యమైనంత మేరకు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం కూడా. అందుకే, నాని తీవ్రంగానే కాకుండా సుదీర్ఘంగా చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

కాంగ్రెసు పార్టీ నుంచి చంద్రబాబు తెలుదేశంలోకి వచ్చారని, అది కాంగ్రెసు పార్టీని వెన్నుపోటు పొడవమేనని ఆయన అన్నారు. ఎన్టీ రామారావును అధికారం నుంచి దించిన వ్యవహారంపై కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తప్పు పట్టారు. ఇదే సమయంలో పామర్రు తెలుగుదేశం నాయకురాలు ఉప్పులేటి కల్పన వ్యవహారం కూడా ముందుకు వచ్చింది. ఆమెను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ మాత్రం ఆలోచన లేకుండా సస్పెండ్ చేశారు. దీంతో నాని వ్యవహారానికి మరింతగా ప్రాధాన్యం చేకూరింది. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడమే నాని వ్యూహంగా కనిపిస్తోంది.