7 జులై, 2012

మహిళా కూలీలపై రేప్ యత్నం: పోలీసు కీచకులుచిత్తూరు/ గుంటూరు: చిత్తూరు జిల్లాలో పోలీసులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఒడిషాకు చెందిన మహిళా కూలీలపై పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు అత్యాచార యత్నానికి ఒడిగట్టారు. గురువారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. చిత్తూరు జిల్లా కలికిరి ఇందిరమ్మ కాలనీలో పోలీసు కానిస్టేబుల్స్ మహిళలపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఒడిషా మహిళా కూలీలు స్థానికంగా హార్టీకల్చర్ క్షేత్రాల్లో పనిచేస్తారు.

మద్యం మత్తులో ఒడిషా మహిళా కూలీలపై అసభ్యంగా ప్రవర్తించారు. ముగ్గురు మహిళా కూలీలపై వారు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులను స్థానికులు అడ్డుకుని కలికిరి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ కానిస్టేబుల్‌పై, హోంగార్డుపై కేసు నమోదు చేశారు. వారిపై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ సోమశేఖర రెడ్డి చెప్పారు.

ఇదిలా వుంటే, గుంటూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని ఓ కాన్వెంట్ పాఠశాలలో ప్రసాద్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను రోమియో అవతారం ఎత్తాడు. పాఠశాల సమీపంలోని మహిళలను వేధించడం పనిగా పెట్టుకున్నాడు. అయితే అతని ఆగడాలకు స్థానికులు అడ్డుకట్ట చేశారు.

తాజాగా, అతను ఓ మహిళను మంచినీళ్లు అడిగాడు. ఆమె మంచినీళ్లు తేవడం చూసి తన గదిలోకి వెళ్లాడు. మంచినీళ్లు గదిలోకి తేవాలని ఆమెకు చెప్పాడు. ఆమె గదిలోకి వెళ్లగానే తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. దీంతో ఆ మహిళ తప్పించుకుని పారిపోయింది. అది గుర్తించిన స్థానికులు ప్రసాద్‌ను పాఠశాలలో నిర్బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాపురాలు కూలిపోతాయనే భయంతో ఆ రోమియో ఆగడాలను సహిస్తూ వచ్చిన మహిళలు ఒక్కటే అతనికి బుద్ధి చెప్పారు.