18 జులై, 2012

వైయస్‌ది రికార్డ్: విజయమ్మ, ప్రభుత్వంపై మండిపాటువిజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రజలపై భారం మోపకుండా పరిపాలన చేశారని, ఇది దేశంలోనే ఒక రికార్డ్ అని, ఇప్పటి వరకు ఎవరూ అలా పాలన చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విజయమ్మ విజయవాడలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారని విమర్శించారు. వైయస్సార్ పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో పెట్టడం దారుణమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పథకాల పేర్లను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, పేరేదైనా ప్రజలకు మేలు చేస్తే చాలన్నారు. ప్రజల మధ్య గడుపుతున్న జగన్‌ను ఉప ఎన్నికలకు ముందు సాక్ష్యులను ప్రభావితం చేస్తారనే కారణాలతో జైలుకు పంపించారన్నారు.

జగన్ త్వరలో బయటకు వస్తారని, మళ్లీ మీ మధ్యలోనే ఉంటారని చెప్పారు. ఒక మంచి ముఖ్యమంత్రిగా వైయస్‌ను జగన్ మరిపిస్తాడన్నారు. వైయస్ ప్రతి సంక్షేమ పథకాన్ని జగన్ అమలుపరుస్తాడని స్పష్టం చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కరెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం ఆసుపత్రులలో కూడా విద్యుత్ లేని పరిస్థితి ఉందన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పల్లెల్లో తాగునీటికి తీవ్ర కొరత ఉందన్నారు. పల్లెల్లో భారీగా విద్యుత్ కోత ఉందన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి రైతు కష్టాలు తెలుసునని, ఆయన నిత్యం రైతులను పైకి తీసుకు వచ్చేందుకు తపన పడ్డాడని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళల సాధికారత కోసం ఫీజు రీయింబర్సుమెంట్స్, పావలా వడ్డీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. వైయస్ రైతు బిడ్డ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ ముఖ్యమంత్రి కూడా వైయస్ చేసినంతగా చేయలేదన్నారు. వైయస్ ఒక్క రూపాయి పన్ను పెంచకుండా పరిపాలన చేశారన్నారు. దేశంలోనే ఇది రికార్డ్ అన్నారు. రైతులకు 15వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నారు.

ప్రభుత్వం ఇప్పుడు తొమ్మిది గంటలు కాదు కదా మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం మూసివేత దిశగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు. రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలంటే వైయస్ వంటి నాయకులు రావాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ ఛార్జీలు పలుమార్లు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రజలు బాబు హయాంలో మళ్లీ ఇప్పుడు కాంగ్రెసు హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.