1 జులై, 2012

'గబ్బర్ సింగ్'తర్వాత శ్రుతి ఓకే చేసిన తెలుగు చిత్రం'గబ్బర్‌సింగ్‌'వరకూ ఒక్క హిట్టూ రాక ఐరన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న శ్రుతి హాసన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి హాట్ ప్రాపర్టీగా మారింది. ఆమె డేట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాణ సంస్దలు వెంటబడుతున్నాయి. అయితే ఆమె ఇప్పుడు కథ,కథనాలకు మొదట ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు కమిటవుతోంది. తాజాగా ఆమె రవితేజతో ఓ కొత్త చిత్రం ఓకే చేసింది.

రవితేజ హీరోగా పి.వి.పి.సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాత. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తారు. ఇందులో హీరోయిన్ గా శ్రుతిని ఎంపిక చేసుకొన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెకి కథ, పాత్ర వివరాలు చెప్పారు. నచ్చడంతో చేసేందుకు అంగీకరించింది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. చెన్నైలో సంగీత చర్చలు సాగుతున్నాయి. ఈ చిత్రానికి 'బలుపు' అనే పేరు పరిశీలనలో ఉంది.

హిందీ చిత్రం లక్ తో పరిచయమైన శృతిహాసన్...తెలుగు, తమిళ, హిందీ... మూడు చోట్లా సినిమాలు చేసినా, సరైన హిట్ దక్కించుకోలేకపోయింది. అందరూ ఐరన్ లెగ్ అని కామెంట్ చేసే స్ధితికి వెళ్లింది. హై ఎక్సపెక్టేషన్స్ మధ్య పెద్ద హీరోలు,దర్శకులతో చేసిన 'సెవెన్త్‌సెన్స్‌', 'ఓ మై ఫ్రెండ్‌', 'త్రీ' లాంటి చిత్రాల్లో మంచి నటన కనబరచినా ఫలితం లేకుండా పోయింది. అయితే శ్రుతికి తొలి విజయం 'గబ్బర్‌సింగ్‌' ద్వారా దక్కింది. భాగ్యలక్ష్మిగా లంగా వోణీలో కనిపించి అలరించింది.

అలాగే 'గబ్బర్‌సింగ్‌'గురించే అందరూ గురించే మాట్లాడుకొంటుంటే... అది వింటూ నేనూ ఆనందపడిపోతున్నా. ట్విట్టర్‌లోకి వెళ్తే ఎన్ని సందేశాలో..ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాలు ఇవ్వలేని సంతృప్తి 'గబ్బర్‌సింగ్‌'తో లభించింది అని తేల్చి చెప్పింది. రామ్‌తో నటించబోతున్నారనే వార్తలని ఆమె ఖండించింది.