14 జులై, 2012

వైయస్ మృతి మరిచారా:విజయమ్మకు బొత్స, బాబుపై..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ వేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప ఎన్నికలు పూర్తవడంతోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి మర్చిపోయారా అని ప్రశ్నించారు.

ఉప ఎన్నికలలో వైయస్ మృతిపై అనుమానాలు రేకెత్తించి లబ్ధి పొందారన్నారు. ఆ తర్వాత ఆ అంశమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రస్తావించడం లేదన్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు తాను అధికారంలో ఉన్నప్పుడు బిసిలకు ఏం చేశారని ప్రశ్నించారు. బాబు మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.

పేదల గురించి బాబు కన్నా తనకు ఎక్కువగా తెలుసునని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఎవరికీ ఏమీ చేయలేదని, ఇప్పుడు మాత్రం బిసిలకు వంద సీట్లు, సబ్ ప్లాన్ అంటూ మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి పని అయిపోయిందన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ మూడు, నాలుగో స్థానానికి పడిపోతుందన్నారు. 2014లో తాము అత్యధిక టిక్కెట్లను బిసిలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. బాబును నమ్మలేదు కాబట్టే ప్రజలు మూడో పక్షమైన జగన్ పార్టీకి ఓటు వేశారన్నారు.

విద్యుత్ కోతకు అధికారుల తీరు కూడా ఓ కారణమని బొత్స అన్నారు. దీనిని అధిగమించకుంటే సర్కారుకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రభుత్వం ఇందిర బాట కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. తెలంగాణకు, రాష్ట్రపతి ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణపై రేపే పరిష్కారం చూపాలని తాను కోరుకుంటానని, అయితే కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయించుకుంటుందని చెప్పారు.

జాతీయ కోణంలోనూ తెలంగాణ పరిష్కారం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యమ నేత కాబట్టి తెలంగాణ వస్తుందనే ఆత్మవిశ్వాసం ఉంటే తప్పు పట్టాల్సిన పని లేదన్నారు. ఇందిరమ్మ బాటలో కాంగ్రెసు శ్రేణులు పాల్గొంటాయన్నారు. ఉప ఎన్నికలకు ఇందిరమ్మ బాటకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.