3 జులై, 2012

మోహన్ బాబు, చిరంజీవి మధ్య మళ్లీ ప్యాచప్

వివాదాలు సృష్టించుకోవడం, మళ్లీ కలిసిపోవడం కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు అలవాటుగా మారింది. తాజా వివాదం నుంచి వారిద్దరు తిరిగి బయటపడినట్లు చెబుతున్నారు. ఈ ప్యాచప్‌నకు చిరంజీవి చొరవ ప్రదర్శించినట్లు చెబుతున్నారు. మాటీవీ ఇటీవల నిర్వహించిన అవార్డుల కార్యక్రమం నుంచి మోహన్ బాబు అర్థాంతరంగా వెళ్లిపోయారు.

నిర్వాహకులపై మోహన్ బాబు మండిపడుతూ బయటకు వెళ్లిపోయారు. మెగా కుటుంబ సభ్యులు రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ అంతా తామే అయి సందడి చేసినట్లు చెబుతున్నారు. అయితే, చిరంజీవి ఫోన్‌లో మోహన్ బాబుతో మాట్లాడినట్లు చెబుతున్నారు. అవార్డుల కార్యక్రమ వివాదం చోటు చేసుకున్న మూడు రోజుల తర్వాత చిరంజీవి మోహన్ బాబుకు ఫోన్ చేశారట.
చిరంజీవి మర్యాదపూర్వకంగానే మోహన్ బాబుకు ఫోన్ చేశారని, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గురించి వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ కూడా జరగలేదని అంటున్నారు. మోహన్ బాబు కూడా ఆ విషయాన్ని ఎత్తలేదని అంటున్నారు. ఆరోగ్యం గురించి, ఇతర విషయాల గురించి చిరంజీవి, మోహన్ బాబు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నట్లు సమాచారం.

చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఏ విధమైన పొరపొచ్చాలు లేవని, ఇరువురు తరుచుగా కలుసుకుంటున్నారని చెబుతున్నారు. చిరంజీవి మోహన్ బాబు ఇచ్చిన ఓ విందుకు కూడా హాజరయ్యారని చెబుతున్నారు. ఏమైనా, మోహన్ బాబు కోపం చాలా తక్కువ కాలం ఉంటుందని అంటారు. ఆయనకు ఎంత త్వరగా కోపం వస్తుందో, ఆయన అంత తొందరగా చల్లారిపోతారని అంటారు.