16 జులై, 2012

నాకూ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా: కాజల్
సూర్య,కాజల్ కాంబినేషన్ లో మాట్రాన్ టైటిల్ తో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో 'డూప్లికేట్‌' అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంపై కాజల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ విషమయై ఆమె తమిళ ఛానెల్ తో మాట్లాడుతూ...‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నింటిలో భిన్నమైన సినిమా ‘మాట్రాన్'. ఇందులో నేను రొటీన్ కమర్షియల్ హీరోయిన్‌లా కనిపించను. కొత్తగా కనిపిస్తా'' అంది కాజల్ అగర్వాల్.

అలాగే సూర్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఓ పాత్ర చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక రెండో పాత్ర చేసే అల్లరైతే అంతా ఇంతా కాదు. ఆ రెండు పాత్రల్లో ఆయన నటన చూస్తే నాకెంతో ముచ్చటేసింది. ఈ సినిమా విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా. సూర్యతో పాటు నాకూ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది అంది.సూర్య హీరోగా, కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘మాట్రాన్' ఆగస్ట్ 15న విడుదల కానుంది.

ఇక ‘నాన్ మహాన్ అల్లా' చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీతో నటించాను. ఇప్పుడు సూర్యతో కూడా నటించేశాను. అన్నదమ్ములిద్దరితో నటించడం ఓ భిన్నమైన అనుభూతినిచ్చింది. సెట్‌లో సూర్య చాలా సరదాగా ఉంటారు. నటన విషయంలో తను పడే తాపత్రయం చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే అని చెప్పుకొచ్చింది. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..''థాయ్‌లాండ్‌కు చెందిన చాంగ్‌, ఈంగ్‌ అనే అవిభక్త కవలల జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో సూర్య ఒక్కో సన్నివేశం కోసం మూడు, నాలుగుసార్లు నటించాల్సి వచ్చింది. ఈ పాత్రలో ఆయనను తప్ప ఇంకెవర్నీ వూహించుకోలేం. సూర్యతో నేను చేసిన 'వీడొక్కడే'కన్నా ముందే ఈ కథను తెరకెక్కించాలని అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది'' అన్నారు.

సూర్య మాట్లాడుతూ ''నా గత చిత్రాలతో పోల్చి చూస్తే ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది'' అన్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కాజల్ హీరోయిన్ కావటం కూడా ఈ చిత్రానికి ప్లస్. సూర్య చిత్రాలు తెలుగులో గతంలో ఇక్కడ మంచి విజయం సాధించటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజీలలో ఉంది.