18 జులై, 2012

ప్రభుదేవాకు నో చెప్పిన త్రిష?అక్షయ్ కుమార్‌తో ‘కట్టా మీటా' అనే బాలీవుడ్ సినిమా చేసిన తర్వాత అక్కడ ఆశించిన ఫలితాలు కనిపించక పోవడంతో హీరోయిన్ త్రిష మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టి ఇక్కడ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇప్పుడు ఆమెకు పలు హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నా చేసే సమయం లేక రిజక్ట్ చేస్తోంది.

తమిళ సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం కె.ఎస్. రవికుమార్ తమిళంలో రూపొందించి ‘సామి' చిత్రాన్ని సంజయ్ దత్ హీరోగా హిందీలో రూపొందించాలని ప్లాన్ చేశారు. ఇందులో సంజయ్‌కి జంటగా త్రిషను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమెను సంప్రదించినా డేట్స్ ఖాళీ లేవని నో చెప్పింది.

డాన్స్ మాస్టర్ నుంచి డైరెక్టర్‌గా మారిన ప్రభుదేవా ఆ మధ్య తెలుగులో రూపొందించిన చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటా'. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న ప్రభుదేవా ఆ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో హీరోయిన్‌‍గా త్రిష అయితేనే కరెక్ట్ అని ఆమెను అడగ్గా....ప్రస్తుతం తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల సాధ్యం కాదని తేల్చి చెప్పిందట.

త్రిష నో చెప్పడంతో ప్రభుదేవా మరో సౌత్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హిందీలో కుమార్ తౌరాని నిర్మించడానికి ముందుకు వచ్చాడు. తౌరాని తనయుడు క్రిష్ హీరోగా నటించనున్నాడు.