5 జులై, 2012

తన కుమార్తె సినీ ప్రవేశం గురించి శ్రీదేవి"మా అమ్మాయిని ఇప్పుడప్పుడే సినిమాల్లోకి పంపించే ఉద్దేశం లేదు. జాన్వి వయసిప్పుడు 15. తనింకా బాగా చదువుకోవాలి.. హీరోయిన్ అవ్వాలా? లేదా? అనేది పూర్తిగా తన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది" అంటున్నారు శ్రీదేవి. ఆవిడ తన తాజా చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ విషయాలు చర్చించారు.

"నేను హీరోయిన్ కాబట్టి, నా కూతుళ్లు కూడా హీరోయిన్ అవ్వాలని రూల్ లేదు. చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంవల్ల నేను చదువుకోలేకపోయాను. కానీ మా పిల్లలకు అలా జరగకూడదు. వాళ్లిద్దర్నీ బాగా చదివించాలనుకుంటున్నాను.పెద్దమ్మాయి జాహ్నవిని హీరోయిన్‌ని చేయబోతున్నానని, ఫలానా హీరో కుమారుడి సరసన మా అమ్మాయి నటించబోతోందని చాలా వార్తలు వచ్చాయి అవన్నీ రూమర్సే" అన్నారు.

"అలాగే మా అమ్మాయిలు రైట్ టైమ్‌లో పెళ్లి చేసుకుని, సెటిలైతే నాకు అంతకన్నా ఆనందం మరోటి ఉండదు. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కాబట్టి.. ఏది పడితే అది తిననివ్వనని కూడా మాట్లాడుకుంటున్నారు. నేనెంత హీరోయిన్ అయినా ఒక తల్లిని. మా అమ్మాయిలు ఒక్క పూట సరిగ్గా తినకపోయినా నేను కంగారు పడిపోతుంటాను" అని తేల్చి చెప్పారు.

ఇంగ్లీష్ వింగ్లీష్ కథ గురించి చెపుతూ... "భర్త, పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని ఓ మహిళ అనుకోకుండా ఒంటరిగా న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. బయటి ప్రపంచం తెలియని తను అక్కడ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఎన్ని తంటాలు పడుతుంది? ఇండియాలో ఉన్నప్పుడు తన విలువ తెలుసుకోని కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆమె సేవలను ఎలా కొనియాడారు? అనేది ఈ చిత్రకథ" అని వివరించారు.