11 జులై, 2012

హీరో మనోజ్ దాడి కేసు...ఆ హీరోయిన్ కోసం గొడవ?
మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ లాస్ట్ వీకెండ్ శనివారం చెన్నయ్‌లో జరిగిన ఓ పార్టీలో తమిళ నటుడు మహత్ రాఘవేంద్రపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై చెన్నయ్‌లోని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది.

గొడవ ఎలా జరిగింది? కారణం ఏమిటి? అనే విషయాలపై చెన్నయ్ నుంచి వినిపిస్తున్న వివరాలను బట్టి ఓ హీరోయిన్ కోసమే ఈ ఇద్దరు గొడవ పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముంబైకి చెందిన మనోజ్ థానే అనే వ్యాపార వేత్త బర్త్ డే సందర్భంగా శనివారం రాత్రి చెన్నయ్‌లోని ఖరీదైన ప్రాంతంలో పార్టీ ఇచ్చాడు.

ఈ పార్టీకి తెలుగు, తమిళ సినీ పరిశ్రమల నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. ఆ రాత్రి అంతా చిత్తుగా మద్యం సేవించారని ఆక్రమంలో గొడవ జరిగినట్లు తమిళ పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. కొన్ని తమిళ పత్రికలు వెలువడించిన వివరాలను బట్టి హీరోయిన్ తాప్సి విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో కోపాన్ని ఆపుకోలేని మనోజ్ మహత్ రాఘవేంద్రపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ సోమవారం మహత్‌తో మాట్లాడారని సమాచారం. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్లనే ఈ గొడవ జరిగిందని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని... మహత్, మనోజ్ చాలా కాలంగా మంచి స్నేహితులు, ఇది అసలు పెద్ద గొడవే కాదు, ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది తమ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాప్సీ విషయంలో వీరి మధ్య ఎలాంటి వివాదం జరిగింది? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ‘ఝుమ్మందినాదం' చిత్రంలో మనోజ్‌తో నటించినప్పటి నుంచి తాప్సీ మోహన్ బాబు కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటోంది. ఆ తర్వాత విష్ణుతో ఓ సినిమా చేసింది. తాజాగా మంచు లక్ష్మితో కలిసి ‘గుండెల్లో గోదారి' అనే సినిమా చేస్తుంది తాప్సీ. ఈ నేపథ్యంలో తాప్సీ కోసం తన తోటి నటుడిపై మనోజ్ దాడి చేసి గాయ పరిచే వరకు వ్యవహారం వెళ్లింది అంటే ఇది ఆలోచించదగ్గ విషయమే..!