11 జులై, 2012

తెలంగాణ వచ్చేస్తోందట: ఇది కెసిఆర్ తాజా మాట
హైదరాబాద్: సెప్టెంబర్ నాటికల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాసః అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ జెఎసి 85 రోజుల కార్యాచరణపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జెఎసి చైర్మన్ కోదండరామ్ పేరు మాత్రం ప్రస్తావించలేదు ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు తొందరెందుకు పడుతున్నారని, తెలంగాణ వస్తుంది కదా అని ఆయన అన్నారు. రాష్ట్రం వచ్చేముందు ఉద్యమించడం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు.

సోమవారం రాత్రి పొద్దుపోయేవరకు తనతో భేటీ అయిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్‌లతో కెసిఆర్ ఆ మాటలు అన్నారు."ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నాడు.. ఆ వెంటనే టీఆర్ఎస్‌లో చేరుతాడు.. సెప్టెంబర్ నాటికల్లా తెలంగాణ వచ్చేస్తుంది. అప్పుడు మన ప్రభుత్వంలో స్వామిగౌడ్‌ను మంత్రిని చేద్దాం'' అని చెప్పారు. స్వామిగౌడ్ పదవీ విరమణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని, దానికి తాను కూడా హాజరవుతానని తెలిపినట్లు సమాచారం.

తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు ప్రస్తుతం కేంద్రం ముందు ఉన్నాయని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దూసుకెళ్తున్నాడని, కనీసం తెలంగాణలోనైనా నిలదొక్కుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, దీంతో తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం జరిగిపోయిందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడుతుందని, దీనిపై నాకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన చెప్పారు. బహుశా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే తెలంగాణ ఏర్పాటుపై ఒక ప్రకటన వెలువడుతుందని, సెప్టెంబర్ నాటికల్లా ప్రత్యేకరాష్ట్రం వచ్చేస్తుందని ఆయన చెప్పారు.

ఈ సమయంలో తెలంగాణ తెచ్చుకోవటమే ముఖ్యమని, తమ పార్టీ తెరాసతో సహా మిగిలినవన్నీ చిన్న విషయాలేనని ఆయన అన్నారు. తెలంగాణ రావటం ఖాయమైంది కాబట్టి రాష్ట్రం ఏర్పాటయ్యాక వివిధ రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.