18 జులై, 2012

ఆయనతో పోల్చుకుంటే అత్యాశే: రాజమౌళి
‘ఈగ' చిత్రం విడుదల అనంతరం రాజమౌళి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. రాజమౌళి ఆ సినిమా తీయడానికి చాలా సమయం తీసుకున్నా అద్భుతం సృష్టించారని అంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కొందరు...టైటానిక్, అవతార్ లాంటి గొప్ప చిత్రాలను రూపొందించిన హాలీవుడ్ గ్రేడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో పోల్చడం మొదలు పెట్టారు. తనను అలా పోల్చడంపై రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో స్పందించారు.

‘జేమ్స్ కామెరూన్ కూడా లేట్‌గా మూవీ తీస్తారని అతనితో నన్ను కంపేర్ చేయడం తప్పు. కామెరూన్‌లా తీశారని ప్రశంసిస్తే సంతోషిస్తా. అంతేకానీ అందరు అంటున్నారు కదా అని నన్ను నేను కామెరూన్‌తో పోల్చుకుంటే అత్యాశే అవుతుంది. కామెరూన్ గ్రేట్ డైరెక్టర్' అంటూ సమాధానం ఇచ్చారు రాజమౌళి.
ఈగ చిత్రం చేయడం ఒక సాహసంగా అభివర్ణించిన రాజమౌళి, మేము ఈగపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులు సినిమాకు మంచి మౌత్ టాక్ ఇవ్వడం వల్లనే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని, నేను వెళ్లిన ప్రతి టూర్లోనూ మంచి స్పందన వచ్చిందన్నారు.

ఈగ చిత్రం తర్వాత చేయబోయే చిత్రం ప్రభాస్‌తోనే అని రాజమౌళి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈగ విజయాన్ని పూర్తి ఎంజాయ్ చేశాక ఆ సినిమా మొదలుపెడతానని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని సంకేతాలు ఇచ్చారు.