11 జులై, 2012

డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేకే..:భూమికఖుషి చిత్రంతో యూత్ గుండెల్లో తిష్ట వేసుకున్న భూమిక ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలు తగ్గించుకుంది. అయితే వివాహం అయ్యాక ఆమెకు సినిమా ఆఫర్స్ రావటం లేకే తగ్గించుకున్నారా అంటే కాదని అంటోంది. తాను ఎక్కువ సినిమాలు ఒప్పుకోకపోవటానికి కారణం...ప్రస్తుతం తెలుగులో హీరోయిన్స్ అంటే స్కిన్ షో,డబుల్ మీనింగ్ డైలాగులకే పరిమితం అవుతున్నాయని అందుకే అలాంటి పాత్రలకు తాను దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

అలాగే నటించింది తక్కువ చిత్రాలైనా అవి గుర్తింపు తెచ్చే చిత్రాలుగా ఉండాలని భావిస్తానని అన్నారు. హీరోయిన్ల నుంచి చాలా వరకు గ్లామర్‌ను, ద్వందార్ధాల సంభాషణలను ఆశిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం గ్లామర్ అనగానే బికినీనే గుర్తుకు వస్తున్నాయన్నారు. అయితే హీరోలు మాత్రం యథాతథంగా నటిస్తున్నారని అన్నారు. తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, మంచి కథా పాత్రలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

ప్రస్తుతం భూమిక...‘ఏప్రిల్ ఫూల్' అనే చిత్రం చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...‘‘నాకిది కమ్‌బ్యాక్ కాదు. ఈ చిత్రంలో అద్భుతంగా నటించడానికి శాయశక్తులా కృషి చేశాను'' అన్నారు భూమిక. జగపతిబాబు, భూమిక జంటగా శ్రీకాంత్ అయ్యంగార్ దర్శకత్వంలో సుధా ఎంటర్‌టైన్‌మెంట్, కర్తాళ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏప్రిల్ ఫూల్'. జీఎల్ శ్రీనివాస్ నిర్మాత.

‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కథకి తగ్గట్టుగా ఉంటుందని ‘ఏప్రిల్ ఫూల్' టైటిల్‌ని ఖరారు చేశాం. హైదరాబాద్‌లో టాకీని, పాటలను ఇండియాలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం'' అని జీఎల్ శ్రీనివాస్ చెప్పారు. ఈ చిత్రకథ నచ్చిందని, భారతీయ చిత్రాల్లోనే కాక 22 అంతర్జాతీయ చిత్రాల్లో నటించానని గుల్షన్ గ్రొవర్ తెలిపారు. లఘు చిత్రాలు తీసి, ఎన్నో సక్సెస్‌లు అందుకున్నానని, ఈ చిత్రానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలని దర్శకుడు అన్నారు.