18 జులై, 2012

కెసిఆర్‌ను ఇరుకున పెట్టిన చంద్రబాబుహైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఇరకాటంలో పెట్టినట్లే. తెలంగాణ అంశంపైనే కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పడం ద్వారా కెసిఆర్ తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ వ్యతిరేకిగా పరిగణిస్తూ ఓటు వేయకూడదనే పార్టీ తెలంగాణ ఫోరం చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు తలొగ్గినట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ చెప్పారు.

కాంగ్రెసు వ్యతిరేకత పేరు మీద కాకుండా ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి అంటూ ఓటింగుకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం ద్వారా తెలంగాణ అనుకూల వైఖరిని చంద్రబాబు ప్రదర్శించారని చెప్పడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులకు అవకాశం చిక్కింది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందని కెసిఆర్ క కొద్ది కాలంగా నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసేందుకే కెసిఆర్ ఈ వాదనను ముందుకు తెచ్చారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత తెలంగాణ ఏర్పాటు కాకపోతే మళ్లీ కాంగ్రెసును దుమ్మెత్తిపోయడం ద్వారా సమస్యను అధిగమించే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

కెసిఆర్ ప్రయత్నాలను చంద్రబాబు తన వ్యూహం ద్వారా తిప్పికొట్టారని భావిస్తున్నారు. తెలంగాణ అంశంపైనే రాష్ట్రపతి ఎన్నికలకు తాము దూరంగా ఉంటే, కెసిఆర్ ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే తాము అవకాశంగా తీసుకోవచ్చుననే వ్యూహాన్ని చంద్రబాబు పన్నినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటేయడం అంత సులభమైన విషయంగా కనిపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన నిర్ణయాన్ని కెసిఆర్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందని తనకు సంకేతాలు అందినట్లు కెసిఆర్ చేసిన ప్రకటనలను కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మధుయాష్కీ కచ్చితంగానే అటువంటిదేమీ లేదని చెప్పారు. తాజాగా సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా అదే మాట అన్నారు. తెలంగాణ ఇస్తారనే సంకేతాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. అయితే, తెరాస ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని, తెలంగాణపై ప్రణబ్‌కు సమగ్ర అవగాహన ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అంటున్నారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యతిరేకత కారణంగానే వైయస్ జగన్ ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించడానికి చంద్రబాబు నిర్ణయం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులకు అవకాశం లభించబోతోందని అంటున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస ఒక తాను ముక్కలేనని చెప్పడానికి తగిన పరిస్థితిని చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల ద్వారా కల్పించబోతున్నారు.