11 జులై, 2012

మళ్లీ మొదలు: కిరణ్ రెడ్డి, బొత్స మధ్య విభేదాలు


హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య విభేదాల కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో కలిసికట్టుగా వ్యవహరించి, కలిసి ప్రచారం సాగించిన ఈ నేతలు మళ్లీ విభేదాల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. వివాదాస్పద జీవోల జారీ విషయంలో విచారణను ఎదుర్కుంటున్న మంత్రులకు న్యాయసహాయం అందించే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 వివాదాస్పద జీవోలు జారీ చేసిన ఆరుగురు మంత్రులను విచారించాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురులో నలుగురికి మాత్రమే న్యాయ సహాయం అందిస్తూ ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాదరావులకు న్యాయ సహాయం అందిస్తూ ఆ జీవో జారీ అయింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను, మోపిదేవి వెంకటరమణను మినహాయించారు.

పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థించలేదని, అందుకే ఆయన పేరు లేదని మొదట ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, పొన్నాల లక్ష్మయ్యకు చెందిన ఫైలు మాయమైనట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. చివరకు పొన్నాల లక్ష్మయ్యకు కూడా న్యాయ సహాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మోపిదేవి వెంకటరమణ విషయంలో మాత్రం న్యాయ నిపుణుల సలహా కోరుతున్నట్లు తెలిపింది.

మోపిదేవి వెంకటరమణకు న్యాయ సహాయం అందించడానికి ప్రభుత్వం వెనకాడడంపై బొత్స గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. మోపిదేవి వెంకటరమణకు న్యాయ సహాయం అందించాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రులకు న్యాయ సహాయం అందించే విషయంలో ముఖ్యమంత్రి తనను సంప్రదించలేదని ఆయన చెబుతున్నారు. దాంతో బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.