11 జులై, 2012

బన్నీ 'జులాయి'లో విలన్ గా చేసానుఅల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రంలో బ్రహ్మాజీ పూర్తి స్ధాయి విలన్ గా చేసారు. ఇన్నాళ్లూ కామెడీకి పరిమితమైన బ్రహ్మాజి ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో కనపడతూండటంతో ఈ సినిమా విడుదల అయ్యాక ఆ తరహా ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నాడు. ఈ విషయమై బ్రహ్మాజీ మాట్లాడుతూ..నేను పూర్తి స్ధాయి నెగిటివ్ పాత్రలో కనపడటం ఇదే మొదటి సారి. అయితే నాకు బ్రహ్మానందం కు మధ్య వచ్చే సీన్స్ మాత్రం హిలేరియస్ గా ఉంటాయి అన్నాడు. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం బ్రహ్మాజీ..గౌరవం షూటింగ్ నిమిత్తం బెంగుళూరు లో ఉన్నారు. అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీ రోల్ చేస్తున్నాడు. అలాగే మరో ప్రక్క మహేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న బాద్షా చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళి మర్యాద రామన్న లో పాత్ర తన కెరీర్ లో హైలెట్ గా నిలించిందని బ్రహ్మాజి అంటున్నారు.

'జులాయి' విషయానికి వస్తే...అల్లు అర్జున్ క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుంది. చదరంగం అంటే ఏమిటి? ఎన్ని గడులు ఉంటాయి? ఏ పావుని ఎలా కదపాలి? ఇలాంటి విషయాలన్నీ తెలిసినవాడితో చదరంగం ఆడడం, అందులో గెలవడం సులభమే. అయితే ఇవేమి పట్టకుండా... తనకు తెలిసిన పద్ధతిలోనే ఆడతానని పట్టుబడితే అతన్ని ఓడించడం కష్టం. రవి అలాంటి కుర్రాడే. ప్రయాణంలో పది దారులు ఎదురుపడితే పదకొండో మార్గం ఎంచుకొంటాడు. అందరూ రిస్కూ అంటుంటే అందులోనే కిక్కు ఉందని నమ్ముతాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి ఓ ఆట మొదలెట్టాడు. ఇంతకీ ఈ ఆటలో గెలిచాడో లేదో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అల్లు అర్జున్‌.

‘‘నేనేడ పుడితె నీకేంటన్నాయ్.. నేనెట్టగుంటె నీకేంటన్నాయ్.. నానేటి చేస్తె నీకేంటన్నాయ్.. సిరాకు పెట్టకన్నాయ్'' ప్రస్తుతం యూత్‌తో చిందులేయిస్తున్న పాట ఇది. ఈ ఒక్క పాటే కాదు. ‘జులాయి' సినిమాలోని మిగిలిన అయిదు పాటలూ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నవే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రారంభంలోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు దేవిశ్రీ అందించిన స్వరాలు శ్రోతలను విశేషంగా అలరిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి.

అలాగే ‘‘ఉల్లాయి లాయి రావో జులాయి'' అంటూ ‘జులాయి' సినిమా చూడటానికి ఆతృతగా ఆహ్వానిస్తున్నారు యువతరం. ‘‘‘గబ్బర్‌సింగ్'తో తెలుగునాట మ్యూజిక్ మేనియా క్రియేట్ చేసిన దేవిశ్రీ, మళ్లీ ‘జులాయి' పాటలతో ఆ మేనియాని కొనసాగించారు. ఈ నెల 8న ఘనంగా ఈ పాటల పండుగ చేసుకోబోతున్నాం. డా.రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాకు వెన్నెముక. సోనూసూద్ కూడా ఓ మంచి పాత్ర చేశారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్వుల పర్యంతం చేస్తాయి. ఇక ఇలియానా ఇందులో కొత్తగా కనిపిస్తారు, ఆడియో సక్సెస్ సినిమా విజయానికి యాభై శాతం తోడ్పడుతుందని అని ఆయనన్నారు.