18 జులై, 2012

ప్రభాస్ రెబెల్ షూటింగ్ @ పొల్లాచ్చి
హైదరాబాద్లో పలు డేర్ డెవిల్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాష్ హీరోగా నటిస్తున్న ‘రెబెల్' చిత్ర యూనిట్ తమిళనాడులోని పొల్లాచ్చి‌లో తదుపరి షెడ్యూల్ జరుపుకునేందుకు బయల్దేరి వెళ్లింది. ప్రభాస్, ఇతర నటీనటులపై అక్కడ కొన్ని సీన్లు చిత్రీకరించిన తర్వాత అంతా తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ప్రస్తుతం ‘రెబెల్' షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆగస్టుకల్లా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్ పనులు కొన్ని ప్రారంభం అయ్యాయి.
తమన్నా, దీక్ష సేథ్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లారెన్స్ సంగీతం కూడా తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. మార్తాండ్.కె వెంకటేష్ ఎడిటింగ్ పనులు చూసుకుంటుండగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.

మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ప్రభాస్ అభిమానుల టేస్టుకు తగిన విధంగా రూపొందిస్తున్నారు దర్శకుడు లారెన్స్. ఈచిత్రాన్ని జె. పుల్లారావు, జె. భగవాన్ శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. చిత్రీకరణకు చాలా గ్యాప్ తీసుకున్న ఈచిత్రం మరో రెండు నెలల్లో విడుదల కానుంది.