3 జులై, 2012

చైనా ఫైటర్లను రప్పిస్తున్న మంచు విష్ణు
కలెక్షన్ కింగ్, కళాప్రపూర్ణ, డాక్టర్ మోహన్ బాబు హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, మంచు విష్ణువర్థన్ నిర్మించనున్న విభిన్న కథా చిత్రం "రావణ". తండ్రి హీరోగా, తనయుడు నిర్మాతగా నిర్మించబోయే ఈ చిత్రం మీద దర్శకులు కె.రాఘవేంద్ర రావు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారనీ, ఈ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనీ ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.'

తాజాగా అందిన సమాచారం ప్రకారం చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం చైనా ఫైటర్లను రప్పించే యోచనలో విష్ణు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వాటిని మైండ్ బ్లోయింగ్‌గా తీర్చి దిద్దాలని, చారిత్రాక సన్నివేశాల్లో పోరాట సన్నివేశాలు చైనా ఫైటర్లు అయితేనే అద్భుతంగా చేస్తారని విష్ణు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి పెద్ద పీట వేయనున్నట్టు మోహన్ బాబు గతంలో ఓ సందర్భంలో చెప్పారు. గతంలోఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానుభావులు రావణాసురుడి పాత్రను పోషించి మెప్పించారనీ ... తనదైన శైలిలో ఈ పాత్రను రక్తి కట్టించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అధునాతనమైన 3 డి పరిజ్ఞానంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో, భారతీయ సినీపరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా నటిస్తారని చెప్పారు.

60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీయబోతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక పూర్తయ్యాక సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ పౌరాణిక మల్టిస్టారర్ మూవీపై సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.