1 జులై, 2012

ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరణ: టెక్కీ ఆత్మహత్య

మహబూబ్‌నగర్/కర్నూలు: ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించడంతో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ఇరవయ్యారేళ్ల హరికృష్ణ హైదరాబాదులోని ఓ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతను అదే పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన హరికృష్ణ నిద్రమాత్రలు మింగాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నరు.

అక్రమ సంబంధం అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోటకొండ గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం సోని అనే మహిళతో వివాహం అయింది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త ఆదివారం ఉదయం రోకలిబండతో కొట్టి చంపారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. అనంతరం భర్త పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

విశాఖపట్నం జిల్లాలో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. కృష్ణా కాలేజీ సమీపంలోని ఎక్సైజ్ కార్యాలయం పక్కన ఖాళీ స్థలంలో పాత గోడ పక్కన క్రికెట్ ఆడుతున్న విద్యార్థులపై ఆ గోడ విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.