11 జులై, 2012

యడ్డీ పోయే గౌడ వచ్చే: కేబినెట్లోకి నీలి నేతల యత్నం
బెంగళూరు: భారతీయ జనతా పార్టీకి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తలనొప్పి పోయి రాజీనామాకు సై అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి సదానంద గౌడ సమస్య ప్రారంభమయింది. అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామాకు సిద్ధమన్న సదానంద గౌడ తాను రాజీనామా చేయాలంటే... అని పార్టీ ముందు కొన్ని షరతులు పెడుతున్నారట. తన షరతులకు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని లేదంటే ససేమీరా అంటున్నారట.

తన షరతులకు అంగీకరించకుంటే బిజెపిఎల్పీ సమావేశాలకు కూడా రానని తెగేసి చెప్పారని తెలుస్తోంది. ఈ నెల 11వ తేదిన జగదీష్ శెట్టార్ కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ లోగా తన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఆయన అధిష్టానం వద్ద కుండ బద్దలు కొడుతున్నారట. శెట్టార్ కెబినెట్లోని 32 మంత్రుల పేర్ల వివరాలను తనకు ముందే ఇవ్వాలని, మంత్రివర్గంలో తన వర్గానికి చెందిన వారిని 15 మందిని తీసుకోవాలని, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా తమకే ఇవ్వాలని షరతులు పెడుతున్నారు.

తనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిని అప్పగించాలని కూడా ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. పార్టీ అధిష్టానం గౌడకే పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే కేబినెట్లోకి 15 మంది మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవి అంశాలపై అధిష్టానం తర్జన భర్జన పడుతోందని సమాచారం. ఈ కారణంగానే ఉప ముఖ్యమంత్రి పదవిని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గౌడకు మద్దతుగా ముప్పై మంది ఆయన వర్గం ఎమ్మెల్యేలు మంగళవారం జరగాల్సిన బిజెఎల్పీ సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సమావేశం కాస్తా వాయిదా పడింది. తమ షరతులపై పెదవి విప్పితే కానీ వచ్చేది లేదని చెబుతున్నారు.

మరోవైపు అసెంబ్లీలో బ్లూఫిలిమ్స్ చూశారనే ఆరోపణలు ఎదుర్కొని పదవులను పోగొట్టుకున్న నేతలు కూడా ప్రస్తుతం కేబినెట్‌లో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పుట్టస్వామి, లక్ష్మణ్ సవది, సిసి పాటిల్‌లు మంత్రివర్గంలో చోటు కోసం పార్టీ సీనియర్ నేతలను, యడ్డీ అనుకూలురులను కలుస్తున్నారట.