12 జులై, 2012

హైదరాబాద్ యువతిపై మలేషియాలో ఏడాదిపాటు రేప్
కౌలాలంపూర్/హైదరాబాద్: ఇరవయ్యారేళ్ల హైదరాబాదు యువతి మలేషియాలో రేప్‌కు గురైంది. ఒక సంవత్సరానికి పైగాఉద్యోగమిచ్చిన యజమాని ఆమెపై అత్యాచారం చేశాడట. బాధితురాలి వివరాలు బయటకు తెలియకుండా కేవలం ఎస్ పేరుతో మాత్రమే పిలుస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఓ స్టోర్‌లో క్యాషియర్‌గా పని చేస్తోంది. బాధితురాలు 2010లో మలేషియాకు వలస వచ్చింది.

వచ్చిన కొత్తలో కొంతకాలం పాటు జోహార్ రాష్ట్రంలోని పెర్మాస్ జయలో పని చేసింది. యజమాని తనపై రోజూ అత్యాచారానికి పాల్పడేవాడని, ప్రతిఘటిస్తే హింస పెట్టే వాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు స్టార్ దిన పత్రిక తెలిపింది. అంతేకాకుండా రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని వాపోయింది.

గత నెలలో అతడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు స్థానిక చర్చి గ్రూపు, హక్కుల సంస్థ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. భారత హైకమిషన్ కు, కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని బాధితురాలు వాపోయింది. నిందితుడిని కేవలం హెచ్చరించి వదిలేశారని తెలిపింది. తన యజమాని కొన్ని నెలలుగా జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది.

ఇప్పటికైనా బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక సంఘాలు కోరుతున్నాయి. తాను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, తనకు పోలీసులు సహాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపింది. కాగా పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.