25 జులై, 2012

విజయమ్మ ఊ కొట్టారు, వారు ఉలిక్కిపడ్డారువైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాకు ఆటంకాలు ఏర్పడకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం హర్షిస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరింత పుంజుకుంటే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు భావిస్తుండగా, తెలంగాణవాదాన్ని దెబ్బ కొట్టడానికి విజయమ్మ ధర్నా పనికి వస్తుందని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు.

విజయమ్మ ధర్నాపై కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి తీరుపై పరోక్ష వ్యాఖ్యలు చేయగా, వి. హనుమంతరావు నేరుగానే ముఖ్యమంత్రి తీరును తప్పు పట్టారు. భారీ భద్రత కల్పించి విజయమ్మను సిరిసిల్లకు పంపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవర్టులున్నారని, వారిని ఏరివేయకుంటే ప్రమాదమని ఆయన అన్నారు. వీసా తీసుకుని తెలంగాణలోకి రావాల్సి ఉంటుందని విజయమ్మ భర్త వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, ఇప్పుడు ఎవరి వీసా తీసుకుని విజయమ్మ తెలంగాణకు వచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయమ్మకు వీసా ఇచ్చారా అని ఆయన అడిగారు.

సీమాంధ్రలో సామాజిక న్యాయం జరగాలని తాము కడప జిల్లాకు వెళ్తే తమకు రక్షణ కల్పిస్తారా అని వి. హనుమంతరావు అడిగారు. విజయమ్మకు అంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగారు. తెలంగాణకు చెందిన ఇతర కాంగ్రెసు నాయకులు కూడా విజయమ్మ దీక్షకు ముఖ్యమంత్రి కల్పించిన భద్రతను తప్పు పడుతున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు మధ్య పోటీ ఉంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో తమకు ఎప్పటికైనా ఢోకా ఉండదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే, పరకాల ఉప ఎన్నిక తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు పెద్ద సవాల్‌ను విసురుతుందనే విషయాన్ని గమనించారు. తెరాసకు, వైయస్సార్ కాంగ్రెసుకు మధ్య పోటీ నెలకొనే పరిస్థితులు వస్తే, తమ ఉనికి గల్లంతవుతుందనే ఆందోళనతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఉన్నారు.

పైగా, తెలంగాణ ప్రాంతంలో మరింత బలం పుంజుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సిరిసిల్లలో విజయమ్మ ధర్నా తలపెట్టారనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో వైయస్ విజయమ్మ ఇలా కార్యక్రమాలు నిర్వహించుకుంటు పోతే కాంగ్రెసు తెలంగాణలో కూడా తీవ్రంగా దెబ్బ తినే పరిస్థితులు వస్తాయి. తాము వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు అటుంచి, కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా ఉండబోమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు భావిస్తున్నారు. 

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మొదటి నుంచీ వైయస్ జగన్‌ను వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు చేతిలో తాము దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి తీరును వారు తప్పు పడుతున్నారు. ఏమైనా, తెలంగాణలో కూడా కాంగ్రెసు ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు పొంచి ఉన్నాయనే అంచనాలు సాగుతున్నాయి.

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

చాలా వరకు బాలన్స్ద్ గా రాసారు
మరి కొన్ని అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించడం సమంజసంగా వుతుంది.
౧) తెలంగాణా ప్రజల ను తీవ్రంగా కలచి వేస్తున్నప్రధాన సమస్య "తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు". ( మా తెలంగాణా మాగ్గావాలె.... మా ఉద్యోగాలు మాగ్గావాలె.... మా నీళ్ళు మా వనరులు మా అస్తిత్వం మాగ్గావాలె )
జగన్ కాంగ్రెస్ ;పార్టీలో వున్నప్పుడు పార్లమెంటులో సమైక్య వాద ప్లకార్డు పట్టుకుని ...తెలుగు దేశం ఎంపీలతో కలసి... పోడియం లోకి దూస్కు వెళ్లి తన సమైక్య వాదాన్ని చాటుకున్నాడు.
కాంగ్రెస్ తో విభేదాలు వచ్చి ఆ పార్టీకి శత్రువుగా మారిన తర్వాత సొంత పార్టీ పెట్టుకుని తన సమైక్య వాదాన్ని అటక మీదకు ఎక్కించి ...దొంగాటకం ఆడుతున్నాడు. తెలంగాణపై నిర్ణయం తీలుకోవలసింది
కేంద్ర ప్రభుత్వం ... తెలంగాణా మా చేతుల్లో లేదు కేంద్రం తెలంగాణా ఇస్తే మేం అడ్డుకోము అని చంద్రబాబు కు సొంత తమ్ముడి లాగా నయ వంచక మాటలు చెప్తున్నాడు. ప్లకారు పట్ట్కున్న నాటి సమైక్య వాదాన్ని ఎక్కడా చెప్పడం లేదు. పరకాల (వరంగల్) ఉప ఎన్నికలలో విజయమ్మ కూడా స్వయంగా తెలంగాణాకు ఎంత అన్కూలంగా మాట్లాడిందో ఎన్ని దొంగ కబుర్లు చెప్పిందో అందరికీ తెలుసు .
అక్కడ కేంద్రం లో చిడంబరమేమో ఇంకా కాంగ్రెస్ తో సహా తెలుగు దేశం , వై ఎస్ ఆర్ పార్టీ , ఎం ఐ ఎం పార్టీ తెలంగాణా పై తమ వైఖరి తెలియ జేయలేదని అందువల్లే నిర్ణయం తీస్కోవడం లో జాప్యం జరుగుతోందని వాళ్ళు చెప్పే వరకూ మేం ఏమీ చేయలేమని లత్తకోరు మాటలు చెప్తున్నా సంగతి కూడా తెలిసిందే.
తెలంగాణా ఏర్పాటు వై ఎస్ ఆర్ పార్టీ చేతిలో లేకపోవచ్చు.
కానీ చేనేత కార్మికుల ఉద్ధరణ, కరెంట్ చార్జీల ను తగ్గించడం కూడా వై ఎస్ ఆర్ పార్టీ చేతిలో లేవు కదా.
మరి చేనేత కార్మికుల కోసం ఎగపోసుకుంటూ ధర్నా చేయడానికి ముందుకొచ్చిన విజయమ్మ తెలంగాణా పై తన పార్టీ వైఖరి బాహాటంగా కేంద్రానికి ఎందుకు తెలియ జేయదు ?
తెలంగాణా ప్రజల మీద అంట ప్రేమే వుంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం తెలంగాణా ప్రజలతో గొంతు కలిపి ఎందుకు డిమాండ్ చేయదు?
౨) విజయమ్మకు ఇంత సెక్యూరిటీ కల్పించి ఆంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం వెనక వై ఎస్ పార్టీ ప్రణబ్ ముకర్జీకి వేసిన వోటు, లోపాయి కారి ఒప్పందం కారణం కాదా ?
ఈ రింగు అంశాలను మీరే మరింత వివరంగా చర్చిస్తే బాగుంటుంది.