24 జులై, 2012

చిరంజీవి సినిమా హక్కులపై... ఆమె ఖండన
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర' చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం అప్పటి వరకు ఉన్న పలు రికార్డులను బద్దలుకొట్టిన ఈచిత్రం చిరంజీవి సినిమా స్టామినా ఏమిటో ఇండస్ట్రీకి రుచి చూపింది. తాజాగా ఈచిత్రం బాలీవుడ్లో రీమేక్ కాబోతోందని, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నారని వార్తలు వినిపించాయి.

ఇది వరకు తెలుగు విక్రమార్కుడు రీమేక్ హక్కులు దక్కించుకుని అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్' చిత్రాన్ని నిర్మించిన సంజయ్ లీలా బన్సాలీ....ఈ సారి ఇంద్ర చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని, ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం.

అయితే ఈ వార్తలను ఇంద్ర చిత్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ కుమార్తె....ప్రియాంక దత్ ఖండించారు. ‘ఇంద్ర' చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఎవరికీ అమ్మలేదని స్పష్టం చేశారు. తామే ఈచిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నామని, హక్కులు ఎవరికీ అమ్మబోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అశ్వినీదత్ తన వై జయంతి మూవీస్ బేనర్‌పై రవితేజ హీరోగా ‘సార్ వస్తారా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు మహేష్, క్రిష్ కాంబినేషన్లో కూడా అశ్వినీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన ‘రాజకుమారుడు' సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందింది. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసే ప్లాన్ చేస్తున్నారు.