24 జులై, 2012

జాన్‌ అబ్రహామ్ సరకు చేరిన దీపికా పడుకునేస్పోర్ట్స్ బైక్‌లకు పేరుగాంచిన ప్రముఖ జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్, భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి 'యమహా రే' అనే స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్కూటర్ కోసం ప్రముఖ బాలీవుడ్ తార 'దీపికా పడుకొనే'ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

దీపికా పడుకొనే ఇప్పటి వరకూ వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ, ఇలా ఓ ఆటోమొబైల్ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే, యమహా మోటార్‌సైకిళ్ల బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్‌ను నియమించుకోగా, తమ స్కూటర్ల కోసం దీపికా పడుకొనేను నియమించుకుంటున్నామని కంపెనీ తెలిపింది.

ఈ తాజా ఒప్పందం ప్రకారం, యమహా స్కూటర్లకు దీపికా పడుకొనే ప్రచారకర్తగా వ్యవహరించడమే కాకుండా, వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించాల్సి ఉంటుంది. ఇండియా యమహా మోటార్ ప్రత్యేకించి భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని అత్యంత స్టయిలిష్ లుక్, పలర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌తో యమహా రే 125సీసీ స్కూటర్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ స్కూటర్ ఉత్పత్తి దశలో ఉంది. ఈ ఏడాది దీపావళి కానుకగా యమహా రే స్కూటర్ మార్కెట్లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ ఎమ్‌డి హిరోయుకి సుజుకి మాట్లాడుతూ.. తమ రే స్కూటర్ కోసం దీపికా పడుకొనేను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని, ఈ స్కూటర్ కూడా దీపికా మాదిరిగానే 'కూల్ అండ్ బ్యూటీ'గా ఉంటుందని, ఆమె ఈ స్కూటర్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయగలదని అన్నారు. ఇప్పటికే, జాన్ అబ్రహామ్ కారణంగా తమ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభించిందని, దీపికా పడుకునే ద్వారా కూడా ఇదే విధమైన స్పందన లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.