10 జులై, 2012

జగన్ ఎమ్మెల్యేలు చంచల్‌గూడ జైలువద్ద కాపలా: బొత్స


రాజమండ్రి: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రజా సంక్షేమాన్ని మరచి చంచల్‌గూడ జైలు దగ్గర కాపలా కాస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామిని సోమవారం దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలున్నాయని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫలితాల తర్వాత ఆ విషయాన్ని ఎందుకు మరిచారని ప్రశ్నించారు. అవినీతి లావాదేవీల్లో జగన్ కొట్టుమిట్టాడుతున్నాడని బొత్స విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని నాగార్జున ఆగ్రికెం ఫ్యాక్టరీపై స్థానికుల్లో ఉన్న అపోహలను యాజమాన్యం తొలగించే వరకు పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి అనుమతివ్వమని చెప్పారు.

కాగా జగన్ అక్రమాస్తుల కేసులో మిగిలిన మంత్రుల మాదిరి మోపిదేవి వెంకటరమణకు కూడా న్యాయ సహాయం అందించాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తానని బొత్స చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణకు పార్టీ పరంగా న్యాయసాయం అందించాలని యోచిస్తున్నారు. మోపిదేవి నిర్దోషి అని తాము నమ్ముతున్న కారణంగా ఆయనకు పార్టీపరంగా సాయం అందించాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.

వాన్‌పిక్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మోపిదేవికి ప్రభుత్వపరంగా న్యాయసాయం అందిస్తే కొత్త చిక్కులు కొన్ని తెచ్చుకున్నట్లు అవుతుందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. మోపిదేవికి ప్రభుత్వపరంగా న్యాయ సాయం అందిస్తే దీన్ని ఆసరాగా చేసుకుని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ప్రభుత్వమే తనకు న్యాయ సాయం అందించాలని కోరే అవకాశం ఉంది. అందుకే ఆయనకు పార్టీ పరంగా సాయం అందించే అవకాశమందని తెలుస్తోంది.