6 జులై, 2012

సమైక్యవాదానికే వైయస్ జగన్ జై?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్యవాదానికే జై కొడుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి బుధవారం మాట్లాడిన తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయంపై శ్రీకాంత్ రెడ్డి తనంత తానుగా మాట్లాడబోరని, వైయస్ జగన్ నిర్ణయాన్నే ఆయన తన మాటల్లో పెట్టారని అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్రం ఇవ్వదలుచుకుంటే తమకు అభ్యంతరం లేదని ఇడుపులపాయ పారటీ ప్లీనంలో వైయస్ జగన్ ప్రకటన చేశారు. అదే పార్టీ విధానంగా ఉంటూ వస్తోంది.

తాజా పరిణామాలను చూస్తుంటే వైయస్ జగన్ పార్టీ ఆ విధానానికి దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో మెజారిటీ స్థానాలపై దృష్టి పెడుతూ తెలంగాణలో తన పునాదులను కాపాడుకునే ఉద్దేశంతో తాజా వైఖరికి వైయస్ జగన్ పార్టీ తెర లేపినట్లు కనిపిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో సమైక్యవాదానికి ఊపు ఇవ్వాలనే ఆలోచనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది.
వైయస్ జగన్‌కు తెలియకుండా సంక్లిష్టమైన రాష్ట్ర విభజన సమస్యపై శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడే వారిపై కేసులుపెట్టి జైల్లో పెట్టాలని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాయల తెలంగాణ అని కానీ, సీమాంధ్ర అని కానీ అంటే ఊరుకునేది లేదని, సొంత ఎజెండాతో వ్యాపార లబ్ధి కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకోవటం దారుణం అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకరరెడ్డి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను దృష్టిలో ఉంచుకొని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణ కావాలని ప్రజలు అడగలేదని, వాస్తవానికి సీమ ప్రజలకు తక్కువేమీ లేదని, ఒకరిని అడుక్కోవలసిన ఖర్మ తమకు పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తాము ఎవరితోనే కలసి ఉండాల్సిన అవసరం లేదని, పూర్వపు రాయలసీమ, బళ్ళారి, రాయచూరు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు అనేది శ్రీకాంత్ రెడ్డి ఉద్దేశం కాదని, సమైక్యవాదానికి ఊపు ఇచ్చే ఉద్దేశంతోనే ఆ మాట అన్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సీమాంధ్ర ప్రాంతంలో మెజారిటీ స్థానాలను గెలుచుకుని తెలంగాణవాదం బలంగా లేని హైదరాబాద్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో కనీసం 40 సీట్లు సాధించినా తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే అంచనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధమైన విజయాలతోనే 2009లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. ఇందుకు అనుగుణంగా సమైక్యవాదాన్ని సీమాంధ్ర ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి అవసరమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి ప్రకటన తెలియజేస్తోందని అంటున్నారు.