10 జులై, 2012

కోరిక తీర్చలేదని కాల్పులు: విద్యార్థిని చితకబాదిన టీచర్

చిత్తూరు/హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ కోరిక తీర్చలేదని ముగ్గురు యువకులు ఓ వివాహితపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెపై నాటు తుపాకితో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక తుటా ఆమె మెడ భాగంలోకి వెళ్లగా, మరో రెండు బుల్లెట్లు ఆమె భుజానికి తగులుతూ వెళ్లాయి. ఆమెను వెంటనే తిరుపతి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ఈ ఘటన పీలేరు మండలం మేళ్లచెరువులో చోటు చేసుకుంది. ఉదయం ముగ్గురు వ్యక్తులు వచ్చి సదరు మహిళను వేధించారు. ఆమె వారిని తోసి వేసింది. దీంతో రెచ్చిపోయిన దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వచ్చారు. దుండగులు వెంటనే అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళ భర్త చిత్తూరులోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వస్తారు.

మరోవైపు హైదరాబాదులోని ఓ ప్రయివేటు పాఠశాలలో క్లాసులో నవ్వాడని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు దారుణంగా చితకబాదాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రసాద్ అనే విద్యార్థి కృష్ణానగర్‌లోని సాయిరాం పాఠశాలలో చదువుతున్నాడు. అతను క్లాసులో నవ్వాడు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయుడు ఆయనను కొట్టాడు. విద్యార్థి తలకు తీవ్రంగా గాయమైంది. విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం కూడా చర్యలుతీసుకుంటామని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.