13 జులై, 2012

టెక్కీ అమెరికా యాత్రతో అప్‌సెట్, భార్య ఆత్మహత్య
బెంగళూరు: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భర్త అమెరికా పర్యటనకు వెళ్తున్నాడని తెలిసి తీవ్ర అసంతృప్తికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. విశ్వనాథ్ అనే పాతికేళ్ల టెక్కీ భార్య హెచ్ సౌమ్య బెంగళూర్‌లోని చన్నసంద్రాలో గల తన ఇంట్లో సోమవారం రాత్రి ఉరేసుకుని మరణించింది. బీజాపూర్‌కు చెందిన సౌమ్యకు 18 నెలల క్రితం విశ్వనాథ్‌తో వివాహమైంది. ఆగస్టులో తాను అమెరికా వెళ్తున్నట్లు తెలిసి భార్య తీవ్ర నిరాశకు గురైందని విశ్వనాథ్ పోలీసులకు చెప్పాడు.

తమ కూతురు వరకట్నం వేధింపులకు బలైందని సౌమ్య తల్లిదండ్రులు సుశీల, హనుమంతరాయ అంటున్నారు. పోలీసులు విశ్వనాథ్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి వ్లల చంద్రసంద్రాకు మారాల్సి రావడంతో టీచర్ ఉద్యోగాన్ని సౌమ్య వదిలేసింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఇంటి యజమాని శివకుమార్ పోలీసులకు చెప్పాడు.

తాను అటుగా వెళ్తున్నప్పుడు ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంటడం తాను చూశానని అతన చెప్పాడు. శివకుమార్ పక్క భవనంలోనే ఉంటాడు. శివకుమార్, ఇరుగుపొరుగువారు బలవంతంగా తలుపులు తెరిచి సౌమ్య దింపి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆమె సూసైడ్ నోట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దంపతులు తరుచుగా పోట్లాడుకునేవాళ్లని, ఆగస్టులో విశ్వనాథ్ అమెరికాకు వెళ్తున్నాడని తెలిసి ఆమె తీవ్ర నిరాశకు లోనైందని, తాను అతనితో వెళ్లడానికి నిరాకరించిందని శివకుమార్ పోలీసులకు చెప్పాడు. అయితే, వరకట్నం కోసం తమ అల్లుడు కూతురుని వేధించాడని సౌమ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇరు వైపులా వాంగ్మూలాలు తీసుకుని కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.