11 జులై, 2012

రాజమౌళిని చంపడానికి ప్లాన్!

దర్శకుడు రాజమౌళిని చంపడానికి ఇతర డైరెక్టర్లు ప్లాన్ వేశారట. రాజమౌళి చేసిన పాపమేంటంటే...వరుస హిట్లు కొట్టడంతో పాటు ‘ఈగ' చిత్రంతో మరోసారి రికార్డు సృష్టించడమే. ఇంతలా అసూయ పెంచుకున్న దర్శకులంతా అతన్ని చంపితే మళ్లీ ఈగ రూపంలో జన్మించి పగ తీర్చుకుంటాడనే భయంతో తన మర్డర్ ప్లాన్ విరమించుకున్నారట.

ఇదంతా మేమేదో కల్పించి చెబుతున్న కథకాదు...దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో కనిపించిన ట్వీట్. ఈగ చిత్రం హిట్ అయినప్పటి నుంచి ఇలాంటి పిట్ట కథలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలానే దర్శనం ఇస్తున్నాయి. తాజాగా అలాంటి పిట్టకథకు తన ట్విట్టర్ ద్వారా ప్రమోషన్ కల్పించాడు రామ్ గోపాల్ వర్మ.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రం ఇటీవల విడుదలై సంచలన హిట్ టాక్‌తో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ, విదేశాల్లో విడుదలైన ప్రతి చోటా దుమ్ము రేపుతోంది. గతంలో ఏ తెలుగు చిత్రం కూడా విడుదల కానన్ని ఎక్కువ దేశాల్లో ఈచిత్రాన్ని రిలీజ్ చేశారు నిర్మాతలు.

నాని, సమంత, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రంలో రాజమౌళి డైరెక్షన్, సుదీప్ నటన సినిమాకు హైలెట్‌గా నిలించాయి. విజువల్ ఎఫెక్ట్స్....ఈగ చేసే విన్యాసాలు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాయి. మరి రాజమౌళా..మజాకా అంటున్నారు ప్రేక్షకులు. తెలుగు దర్శకుల్లో ఏ దర్శకుడికి లేని విధంగా స్టార్ హీరోల రేంజిలో తనకు ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఒక్క రాజమౌళికే చెల్లింది.