24 జులై, 2012

బిగ్ బి ఇంట్లో చోరీ చేస్తూ పట్టుబడ్డ అభిమాని

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతూ 20 ఏళ్ల అభిమాని ఒకరు అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం దీపక్ కేవత్ అనే వ్యక్తి అత్యంత భద్రతతో కూడిన అమితాబ్ నివాసం ‘జల్సా'లోకి కాపౌండ్ వాల్ లోని చెట్టు ద్వారా ప్రవేశించి...ఇంట్లోని టాప్ ఫ్లోర్ లో ఉన్న బచన్స్ బెడ్ రూమ్ లోకి చొరబడ్డాడు. బెడ్ రూంలో డెస్కులో ఉన్న రూ. 8వేల నగదును జేబులో వేసుకున్నాడు. ఈలోపే అతన్ని సెక్యూరిటీ గార్డులు పట్టుకుని జుహు పోలీసులకు అప్పగించారు.

పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరుగా...14 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. మధ్య ప్రదేశ్ కు చెందిన కేవత్ నెలన్నర క్రితం ఉపాధి కోసం ముంబై వచ్చాడు. రైల్వే ఫ్లాట్ ఫారమ్ పైనే ఉంటూ ఏదైనా పని కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతను అమితాబ్ ఇంట్లోకి కేవలం దొంగతనం కోసమే వచ్చాడా..? ఇంకేమైనా కారణతో వచ్చాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ విషయమై అమితాబ్ తన బ్లాగులో పేర్కొంటూ...‘ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మా ఇంట్లోకి చొరబడి పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. మా ఇంట్లోని మోస్ట్ సెన్సిటివ్ ఏరియాలోకి వచ్చాడు. ఇంత భద్రత ఉన్నా అతనెలా వచ్చాడు' అంటూ భద్రత ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలియగానే అమితాబ్ అభిమానులంతా ఒక్కసారిగా నివ్వెర పోయారు. తమ అభిమాన స్టార్ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి సకాలంలో పట్టుబడ్డాడు కాబట్టి ఫర్వలేదు కానీ...ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏమిటి అని భద్రత ఏర్పాట్లపై తమ అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు.