7 జులై, 2012

బాలయ్య సినిమా: ఒక హీరో, ఆరుగురు విలన్లునందమూరి బాలకృష్ణతో 'శ్రీమన్నారాయణ' సినిమా చేయడం మరచిపోలేని గొప్ప అనుభవమని ఆ చిత్ర నిర్మాత, ఎల్లో ఫ్లవర్స్ బేనర్ అధినేత రమేశ్ పుప్పాల చెప్పారు. బుధవారం సంస్థ కార్యాలయంలో పుట్టినరోజు జరుపుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. "ఈ సంవత్సరం రెండు సినిమాలు ప్రారంభించాం. ఒకటి 'శ్రీమన్నారాయణ', రెండు 'పైసా'. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'శ్రీమన్నారాయణ' షూటింగ్ దాదాపు పూర్తయింది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. బాలకృష్ణ సినిమాల్లో విభిన్న చిత్రం. చానల్ రిపోర్టర్‌గా అద్భుతంగా చేశారు. బాలయ్యతో పనిచేయడం మరచిపోలేని గొప్ప అనుభవం" అని ఆయన అన్నారు

"ఒకే షెడ్యూల్లో సినిమా పూర్తయిందంటే ఆయనచ్చిన అమితమైన సహకారం వల్లే. ఆయన రూపంలో ఓ మంచి స్నేహితుడు నాకు లభించారు. వ్యక్తిగా ఆయన చాలా గొప్ప మనిషి. 'శ్రీమన్నారాయణ' మ్యూజికల్‌గా కూడా చాలా బాగా వచ్చింది. చక్రి అద్భుతమైన సంగీతం అందించాడు. ఆ పాటలు తీసేప్పుడే సెట్స్‌మీద యూనిట్ సభ్యులంతా డాన్స్ చేశారు. స్విట్జర్లాండ్, మలేషియాలోనూ షూటింగ్ జరిపాం. అక్కడ పాటలు చిత్రీకరించాం. 

ఇందులో ఆరుగురు విలన్లు ఉన్నారు. బావామరదళ్ల మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. హీరోయిన్లు పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా ఇద్దరూ ఆకట్టుకుంటారు. దర్శకుడు రవికుమార్ చెప్పింది చెప్పినట్లు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆగస్టులో రిలీజ్. ఈ ఏడాది గొప్ప హిట్ అవుతుంది. ఇక నాని హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో నిర్మిస్తున్న 'పైసా' 60 శాతం పూర్తయింది. కృష్ణవంశీ చాలెంజింగ్‌గా ఈ సినిమాని తీస్తున్నారు'' అని ఆయన చెప్పారు.

దర్శకుడు రవికుమార్ చావలి మాట్లాడుతూ "బాలయ్య క్రమశిక్షణ, సమయపాలన వల్లే అనుకున్న సమయానికి, 85 రోజుల్లో 'శ్రీమన్నారాయణ' షూటింగ్ పూర్తి చేయగలిగాం. కథ విన్నప్పుడే అడ్వంచరస్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పి చేయడానికి వెంటనే అంగీకరించారు. ఆయన ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకునే వైవిధ్యంగా ఆయన పాత్రను రూపొందించాను. బాలకృష్ణగారు కూడా కొత్తదనం కోసం తపించే వ్యక్తి. రిపోర్టర్ కేరక్టర్‌ను గొప్పగా చేశారు. ఆయన హిట్ సినిమాల్లో కచ్చితంగా ఇది చోటు సంపాదించుకుంటుంది. కమర్షియల్ డైరెక్టర్‌గా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా'' అని చెప్పారు.