5 జులై, 2012

మిస్‌డ్ కాల్‌తో అఫైర్ మొదలై, హత్యతో ముగిసింది
బెంగళూర్: మిస్‌డ్ కాల్‌తో ప్రారంభమైన ఓ అఫైర్ హత్యతో ముగిసింది. కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విరాజ్‌పేటలోని ఓ లాడ్జిలో జరిగిన ఓ మహిళ హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. 30 ఏళ్ల గీత అలియాస్ లత జూన్ 16వ తేదీన లాడ్జిలో ఉరేసుకుని చనిపోయినట్లు కనిపించింది.
ఈ హత్య కేసులో పోలీసులు శనివారం రవి అలియాస్ రత్తమడ కుట్టన్నను కొడగులోని టి షెట్గిగెరిలో అరెస్టు చేశారు. ఎస్పీ మంజునాథ్ అన్నిగెరి ఈ విషయం చెప్పారు. ఆరు నెలల క్రితం కుట్టన్న మొబైల్‌కు మిస్‌డ్ కాల్ వచ్చింది. అతను ఆ నెంబర్‌కు కాల్ చేశాడు. అది గీతకు చెందిన నెంబర్. వారిద్దరికి ఫోన్‌పైనే స్నేహం ఏర్పడింది.

కుట్టన్నకు గీతను కలవాలనే కోరిక కలిగింది. దీంతో ఆమెను వీరాజ్‌పేటకు మేలో ఆహ్వానించాడు. ఆమె కోయంబత్తూర్‌లోని ఓ కర్మాగారంలో పనిచేస్తుంది. గీత చూసిన తర్వాత తాను తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు కుట్టన్న తన వాంగ్మూలంలో చెప్పాడు. ఆమె అతను అనుకున్నంత అందంగా లేకపోవడం, పైగా ఆమెకు అప్పటికే పెళ్లి కావండ ఇద్దరు పిల్లలు ఉండడం కుట్టన్న అసంతృప్తికి కారణాలు.

అంతకు ముందు తనకు పెళ్లి కాలేదని ఆమె చెప్పిందని, తనకు పెళ్లయినట్లు ఆమె చెప్పిన వెంటనే తాను మోసానికి గురైనట్లు భావించానని కుట్టన్న పోలీసులకు చెప్పాడు. విరాజ్‌పేటలోని లాడ్డిలో జూన్ 15వ తేదీన ఆమె తనతో ఉండడానికి కుట్టన్న అనుమతించాడు. ఆమెకు విపరీతంగా మద్యం తాగించి, సెక్స్ చేశాడు. ఆ తర్వాత నైలాన్ తాడుతో ఉరేసి చంపాడు. గీత విరాజ్‌పేటలోని తోరా గ్రామానికి చెందింది.

హోటల్‌లోని రిసెప్షన్‌లో గల సిసిటివి ద్వారా క్లూ సంపాదించిన పోలీసులు కుట్టన్నను పట్టుకున్నారు. కుట్టన్న లాడ్డీలో మైసూర్ చిరునామా ఇచ్చాడు. అక్కడికి వెళ్లేసరికి కుట్టన్న పరారయ్యాడు. అతను బెంగళూర్‌లోని ఎంటిఆర్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చివరికి అతన్ని పట్టుకున్నారు.