2 జులై, 2012

మగధీర, గబ్బర్ సింగ్ రికార్డుల గోల..!(ఇదీ వాస్తవం)రామ్ చరణ్ నటించిన ‘మగధీర' చిత్రం సృష్టించిన సెన్షేషన్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఏ చిత్రం హిట్ టాక్ వినిపించినా....ఆ చిత్రం మగధీర చిత్రాన్ని బీట్ చేస్తుందా? లేదా? అంటూ చర్చలు సాగేవి. చివరకు మెగా హీరో రికార్డును మెగా హీరోనే బద్దలు కొట్టారు. అయితే మగధీర చిత్రాన్ని అన్ని విషయాల్లో గబ్బర్ సింగ్ చిత్రం బీట్ చేయలేక పోయింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
నైజాం ఏరియాలో గబ్బర్ సింగ్ చిత్రం కలెక్షన్ల పరంగా మగధీరను బీట్ చేసింది. ఈచిత్రం ఇక్కడ ఇప్పటి వరకు మగధీర కంటే రూ. 25 లక్షల షేర్ ఎక్కువ సాధించినట్లు తెలుస్తోంది. అయితే సీడెడ్, ఇతర ఏపీ టెర్రిటరీల్లో మాత్రం మగధీర చిత్రమే ఇప్పటికీ నెం.1గా ఉంది. ఆ ఏరియాల్లో చాలా చోట్ల గబ్బర్ సింగ్ చిత్రం మగధీర కంటే రూ. 25 నుంచి 50 లక్షలు తక్కువ షేర్ సాధించిననట్లు సమాచారం.

అయితే రాష్ట్రం బయట మాత్రం ‘గబ్బర్ సింగ్' చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే నెం.1 పొజిషన్లో నిలిచింది. ఓవర్సీస్‌లో ఈచిత్రం మగధీర కంటే రూ. 3 కోట్ల ఎక్కువ షేర్ సాధించింది. అదే విధంగా కర్నాటకలో కోటి, తమిళనాడులో రూ. 50 లక్షలు మగధీర కంటే ఎక్కువ షేర్ సాధించింది.

అయితే టోటల్ షేర్ విషయానికొస్తే మాత్రం మగధీర చిత్రం 71 కోట్ల పైచిలుకు సాధిస్తే...గబ్బర్ సింగ్ చిత్రం 50 రోజుల్లోనే 73 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇద్దరు మెగా హీరోలే కావడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. రామ్ చరణ్ మగధీర చిత్రం తక్కువ కాకుడదనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ కలెక్షన్ల వివరాలను గోప్యంగా ఉంచాల్సిందిగా నిర్మాతను ఆదేశించినట్లు తెలుస్తోంది.