13 జులై, 2012

టుబి కంటిన్యూడ్!: జగన్‌ను 6గంటలు ప్రశ్నించిన ఈడి


హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆరు గంటల పాటు విచారించారు. ఉదయం పదిన్నర గంటలకు జగన్ విచారణ ప్రారంభించిన అధికారులు నాలుగున్నర గంటలకు ముగించారు. జగన్ నుండి పలు సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి విదేశాల నుండి పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏవైనా అక్రమ పెట్టుబడులు ఉన్నాయా అని జగన్‌ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మలేషియా, సింగపూర్, లగ్జెంబర్గ్ తదితర దేశాల నుండి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై వివరాలు ఆరా తీశారని తెలుస్తోంది. జగన్‌ను విచారించేటప్పుడు అతని తరఫు న్యాయవాదులు ఉన్నారు. కాగా రేపు కూడా ఈడి బృందం అతనిని ప్రశ్నించనుంది.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఆయన కంపెనీలలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులపై ప్రశ్నించేందుకు ఉదయం వెళ్లిన విషయం తెలిసిందే. చంచల్‌గూడ జైలులోనే ఈడి జగన్‌ను ప్రశ్నించింది. ఉదయం పదిగంటల సమయానికి ఈడి అధికారులు జైలుకు చేరుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో ఈడి జగన్ నుండి పెట్టుబడులపై ఆరా తీశారు.

7 నుంచి 21 తేదీలోగా జగన్‌ను జైల్లో ఉదయం 10 నుంచి 5 గంటలలోపు ప్రశ్నించడానికి ఈ నెల 6న సిబిఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు జగన్‌కు జైలులో ఈడి అధికారులు పణిభూషణ్, వైయ్ ఎన్ రావు 9వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈరోజు జరిగే విచారణలో ఈడి అధికారులు ముందుగా రూపొందించిన ప్రశ్నావళిని జగన్‌కు అందించారని సమాచారం.