18 జులై, 2012

బాలకృష్ణ 50-50 ఫార్ములా..!నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతానని అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళితే సినిమాలకు దూరం అవుతారనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఆయనకు ఇప్పుడప్పుడే సినిమాలకు దూరం అయ్యే ఆలోచన లేదని బాలయ్య సన్నిహితులు అంటున్నారు.

నెలలో సంగం రోజులు తెలుగుదేశం పార్టీ తరుపున రాజకీయాల్లో పాల్గొనేలా, మిగిలిన రోజులు సినిమా షూటింగులకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలా చేయడం వల్ల రాజకీయాల్లో ఫెయిల్ అయినా....సినిమాల ద్వారా సేఫ్ అవ్వొచ్చని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ఏది ఏమైనా రెండు పడవల మీద ప్రయాణం చేయాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

బాలయ్య ప్రస్తుతం రవి చావలి దర్శకత్వంలో ‘శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. ‘మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. బాలయ్య అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అదే విధంగా తన రాజకీయ ఎంట్రీకి సపోర్టును ఇచ్చే విధంగా ఓ సినిమా చేయాలనే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, తన తండ్రి ఎన్టీఆర్ పుట్టిన గడ్డ కావడంతో తనకు రాజకీయంగా బలాన్ని ఇస్తుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుగేదేశం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.