4 జులై, 2012

రోడ్డు ప్రమాదానికి గురైన ‘ఆట-5’ విన్నర్ గీతిక
జీ తెలుగు చానల్ రియాల్టీ షో ‘ఆట-5' జూనియర్స్ విన్నర్‌గా నిలిచిన బాన్సర్ బేబీ గీతిక రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం చాగల్లు పరిసరాల్లోని భీమవరం అడ్డరోడ్డు దగ్గర బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆట-5 విన్నర్ గీతిక తీవ్రంగా గాయపడింది.

గీతిక తండ్రి, డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో కారును సిమెంటు దిమ్ముకు ఢీ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గీతకకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆట 5తో వచ్చిన గుర్తింపుతో గీతిక పలు సినిమాలతో పాటు, టీవీ సిరియల్స్‌లో అవకాశం దక్కించుకుంది. ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.