15 జులై, 2012

4వ స్థానంలో రామ్ చరణ్ ‘రచ్చ’మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన రచ్చ చిత్రం నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి 100 రోజుల వేడుకను సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థకు హిట్ చిత్రాన్ని అందించిన రామ్ చరణ్ తేజ్, దర్శకుడు సంపత్ నందికి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ..... రామ్ చరణ్ జంజీర్ షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్‌లో ఉన్న నేపథ్యంలో హీరో ఊర్లోకి వచ్చాక శతదినోత్సవ వేడుక ఎక్కడ నిర్వహించాలన్న విషయాన్ని చర్చించి తేదీని వెల్లడిస్తాం'' అని చెప్పారు. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ప్రతిష్టను రచ్చ చిత్రం పెంచిందన్నారు. భవిష్యత్‌తో తమ సంస్థ మరిన్ని హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు స్తుందని తెలిపారు. పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ...రామ్ చరణ్ కెరీర్లోనే ఈ చిత్రం ఒక గొప్ప చిత్రంగా నిలిచిందని, సంపత్ నంది మంచి దర్శకుడు అవుతాడని కితాబిచ్చారు.

ఇక ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘రచ్చ' చిత్రం కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా చరిత్రలో 4వ స్థానంలో నిలిచిందని. తొలి మూడు స్థానాల్లో గబ్బర్ సింగ్, మగధీర, దూకుడు చిత్రాలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. టాప్ 5లో చరణ్ చిత్రాలు రెండు చోటు దక్కించుకోవడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం అటు ఆడియో పరంగా కూడా మంచి విజయం సాధించింది. మణిశర్మ అందించి బాణీలు అలరించాయి. ముఖ్యంగా వాన వాన రీమిక్స్ సాంగ్, అందులో రామ్ చరణ్, తమన్నా అభినయం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.