17 జులై, 2012

2014 ఎన్నికల్లో ఆ ముగ్గురే 'స్టార్‌'లు


2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి హీరో బాలకృష్ణ, కాంగ్రెసుకు రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ముఖ్య నేత చిరంజీవి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలే స్టార్ కంపెయినర్‌లు కానున్నారు. టిడిపిలో నందమూరి - నారా కుటుంబాల మధ్య వారసత్వ పోరు నడుస్తోంది. కారణాలు ఏవైనా బాలకృష్ణ మాత్రం బావ చంద్రబాబుకే ఓటేస్తున్నారు.

రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌లు పార్టీపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. బాబు తన తనయుడు లోకేష్ కుమార్‌ను రాజకీయాలలోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడంతో హరికృష్ణ, జూనియర్‌లు తమ కోసం 'పట్టు' పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో వారు 2014లో టిడిపి తరఫున ప్రచారం చేసే అవకాశాలు చాలా తక్కువే అని అంటున్నారు.

పార్టీకి అవసరం ఉన్నప్పుడు తాను వస్తానని జూనియర్, టిడిపిని గెలిపించడమే తమ ధ్యేయమని చెబుతున్న హరికృష్ణలు మాటల వరకే కానీ చేతలలో మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఇటీవల తనకు అత్యంత సన్నిహితుడు అయిన కొడాలి నాని జగన్‌కు జై కొట్టినప్పుడే జూనియర్ గానీ, హరి గానీ ఆయనను తిరిగి వెనక్కి రప్పించక పోవడాన్ని చూస్తుంటే వారికి పార్టీ పట్ల అంత ఆసక్తి లేనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

టిడిపిలో బాలయ్య, జూనియర్‌లు క్రౌడ్ పుల్లర్‌లు. జూనియర్ దూరం అయ్యే పక్షంలో ఆ పార్టీకి బాలయ్య ఒక్కరే స్టార్ కంపెయినర్ కానున్నారు. నందమూరి కుటుంబానికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా బాలయ్య ఒక్కడే వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీని గట్టెక్కించగల కంపెయినర్‌గా కనిపిస్తున్నారు. కాంగ్రెసు విషయానికి వస్తే చిరంజీవి మినహా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు అంత సీన్ లేదని అంటున్నారు.

కిరణ్ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నప్పటికీ ఆయనకు పట్టు లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇక బొత్స ఓ సామాజిక వర్గం నేతగా ముద్రపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిలా వీరు ప్రజలలో మాస్ ఇమేజ్ సంపాదించుకునేలా కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి ఒక్కరే ఆ పార్టీకి 2014లో దిక్కు కానున్నారని అంటున్నారు. ఆయన తన స్టార్ ఇమేజ్‌తో 2009లో డెబ్బై లక్షలకు పైగా ఓట్లను తన పార్టీకి సంపాదించుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీలో జగన్ మినహా మరొక స్టార్ కంపెయినర్ కనిపించరు. ఆయన ఒంటి చేతితో పార్టీని గెలిపించాల్సిన పరిస్థితి ఉంది. మరి బాలయ్య, చిరంజీవిల స్టార్ ఇమేజ్ మంత్రం ఏ మేరకు పని చేస్తుంది, జగన్‌పై ఉన్న సానుభూతి అప్పటి వరకు పని చేస్తుందా అనేది చూడాలి.