14 జులై, 2012

యువతుల అక్రమ రవాణా: 170 ఏళ్ల కారాగార శిక్ష
ఖాట్మాండ్: బాలికలను అక్రమంగా రవాణా చేసినందుకు ఓ వ్యక్తికి 170 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది నేపాల్ కోర్టు. సాధారణంగా ప్రస్తుతం మనిషి జీవిత కాలం 56-70. మరీ అయితే వంద సంవత్సరాలు బతుకుతారు. అయితే నేపాల్ కోర్టు మాత్రం ఓ నేరస్తుడికి ఆయన జీవిత కాలానికి మించిన శిక్షను విధించింది.

నేరస్తులకు వివిధ దేశాలలో వివిధ రకాలుగా శిక్షలు ఉంటాయి. అయితే నేపాల్ కోర్టు మాత్రం అరుగురు అమ్మాయిలను భారత్‌లోని వ్యభిచార కేంద్రాలకు తరలించినందుకు సదరు వ్యక్తికి 170 ఏళ్ల సుదీర్ఘ కారాగార శిక్ష విధించడం గమనార్హం. యుక్త వయసులోని బాలికలను భారత్‌లోని వ్యభిచార కేంద్రాలకు అక్రమంగా రవాణా చేసినందుకు.. బాజిర్‌ సింగ్‌ తమంగ్ అనే ముప్పయ్యేడేళ్ల సంవత్సరాల నిందితుడికి అక్కడి సిద్ధుపల్‌చౌక్ జిల్లా కోర్టు ఈ కఠిన శిక్షను విధించింది.

14 నుంచి 17 ఏళ్లలోపు బాలికలను అపహరించి వ్యభిచార కేంద్రాలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్నాడు. ఎలాగోలా తప్పించుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తమంగ్ నేరాన్ని నిర్ధారించే సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు.

దాంతో కోర్టు తమంగ్‌కు 170 సంవత్సరాల జైలుశిక్షతోపాటు.. రూ.13లక్షల జరిమానా విధించింది. ఒక్కో బాధితురాలికి పరిహారంగా లక్షన్నర రూపాయలు చెల్లించాలని తీర్పుచెప్పింది. కాగా నిందితుడికి స్వయంగా అగ్రాలో ఓ వ్యభిచార కేంద్రం ఉందని తెలుస్తోంది. నేపాల్ పోలీసులు ఇతనిని సంవత్సరంన్నర క్రితం అరెస్టు చేశారు.