15 జులై, 2012

'14లో టార్గెట్ జగన్: రంగంలోకి చిరంజీవి

రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటనలకు శ్రీకారం చుడుతుండగా, అదే కార్యక్రమం సందర్భంగా పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో చిరంజీవికి కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.

ఇటీవల ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కిరణ్, బొత్సలు సానుభూతి తదితర కారణాలు చూపినప్పటికీ అధిష్టానం అవి హేతుబద్దమైనవిగా భావించడం లేదు. దానికి తోడు చిరంజీవి కూడా సమన్వయం లేకపోవడమే కారణమని అధినేత్రి సోనియా గాంధీకి ప్రత్యేక నివేదిక ఇచ్చారు. దీంతో అధిష్టానం వారికి మరోసారి అవకాశమిస్తూ 2014 ఎన్నికల వరకు పార్టీని బలోపేతం చేయాలని తలంటింది.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత జగన్ నిత్యం ఓదార్పు, ధర్నాల పేరుతో ప్రజలలో ఉన్నారని, కాని కాంగ్రెసు నేతలు మాత్రం ప్రజలలోకి వెళ్లలేదని అది ఓటమికి ప్రధానమైన కారణమని కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధిష్టానం కిరణ్, బొత్స, చిరంజీవిలకు సూచించింది. దీంతో ఇక నుండి 2014 ఎన్నికల వరకు నిత్యం ప్రజల్లో ఉండాలని వీరు భావిస్తున్నారు. అందులో భాగంగానే కిరణ్ ఇందిర బాట చేపట్టారని అంటున్నారు.

బొత్స కూడా ఇక జిల్లాల పర్యటనలతో బిజీ బిజీగా ఉండనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు ప్రధాన కంపెయినర్ అయిన చిరంజీవి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు నుండి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన పర్యటనలు చేయనున్నారు. రైతుల దీర్ఘకాల సమస్యల నుంచి బాలికల వసతి గృహాల్లో వసతుల వరకు ప్రతి అంశం పైనా స్వయంగా పరిశీలిస్తారని, వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలుస్తోంది.