28 జూన్, 2012

ఎపి అఫైర్స్‌పై రాహుల్ దృష్టి: ఆజాద్‌తో కిరణ్ భేటీన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీ దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఆయన రాష్ట్రానికి చెందిన నాయకులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సాధించిన విజయాలపై, తెలంగాణ అంశంపై, రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితిపై ఆయన రాష్ట్ర కాంగ్రెసు నాయకులను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, ఉప ఎన్నికల ఫలితాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ అంశంపై కూడా ఆజాద్ కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆజాద్ కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఆజాద్‌ను కలిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ అవుతూ బిజీగా ఉన్నారు. రాయల తెలంగాణతో తమ పార్టీ అధిష్టానం ముందుకు వస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. రెండు రోజుల క్రితం గులాం నబీ ఆజాద్ తెలంగాణ అంశంపై, రాష్ట్ర పరిస్థితులపై సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో మాట్లాడినట్లు చెబుతున్నారు. తెలంగాణపై, ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

రాష్ట్రానికి చెందిన 13 మంది పార్లమెంటు సభ్యులు ఢిల్లీలోనే ఉన్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రానికి మూడు ప్రాంతాల నాయకులతో పార్టీ అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది.